కిందన్న సంతోషంతో ఉబ్బితబ్బిబై పోతూ, తన సంతోషాన్ని మాత్రం పైకి కనపడనీయక వాగ్వివాదానికి దిగుతాడు. ఈ సింగీ సింగని వాగ్వివాదంలో మొరటు హాస్యం ఎక్కువ దొర్లటం వలన కొంచెం విరసంగా వుంటుంది. సవతుల కయ్యం మాదిరి చోడిగాడు, సింగి ఈ విధంగా ప్రారంభిస్తారు.
- చోడిగాడు:
మనసు లాకపోతే మును పెరుంగనె సింగి
అదును లంటినోరు అగలించి
కళ్ళెమంటి బిగ్గ కఱచియు బట్టితే
కొరడ దెబ్బలనుచు ఎరుగవటవె?
- సింగి:
కొరడ దెబ్బలనుచు మారి మరి బలికేవు
తరముగాదు నాదు దరికి రాకు
మురువు పరువులేని పురుషత్వమేల నీ
సరసమెల్ల నాకు చాలు పోర.
- చోడిగాడు:
సింగీ నను జూచితె నే
నంగజుడను రూపురేఖలందును నా
సంగతి నీవిటులైన తిరు
గంగను న్యాయంబు గాదు గట్టి సింగీ.
- సింగి:
చేకువలె నుండు మీసాలు, చీపికళ్ళు
చింకితల గుడ్డ, గొంగళీ చంకబెట్టి
కప్పు పొక్కిడి పొగసిద్ద వొప్ప జూచి
నయమె నిన్నంగజుడవన్న నవ్వరటర?
ఈ విధమైన వాగ్వివాదంతో సంవాదం ముగిసి, ఇరువురికీ సఖ్యత కుదిరి, ఇంటికి పోవడంతో కథ సుఖాంతమై మంగళాంతం అవుతుంది.