పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/185

ఈ పుట ఆమోదించబడ్డది

తోలుబొమ్మల్ని ఎక్కడో మార్కెట్టుల్లో కొన్నుక్కు రారు. ఈ బొమ్మలను తయారు చేసే చిత్రకారులు వారి వారి దళంలోనే వుంటారు. ఎప్పుడు బొమ్మ అవసరమనుకుంటే అప్పుడు అప్పటి కప్పుడు తయారు చేసుకుంటారు. ఈ బొమ్మలు మేక చర్మంతోనూ, జింక చర్మంతోను, దుప్పి చర్మంతోనూ తయారు చేస్తారు.

పాత్రలకు తగిన ప్రతిమలు:

బొమ్మలాట కథా విధానంలో వచ్చే ఉద్దాత్తమైన పాత్రలన్నింటికీ రాముడు, కృష్ణుడు, విష్ణువు, ఇంద్రుడు, దేవతలు, సీత, సావిత్రి, ద్రౌపది మొదలైన పాత్ర లన్నింటికీ జింక చర్మాన్ని ఉపయోగిస్తారు. జింక చర్మాన్ని పూజా సమయాలలో ఎంత పవిత్రంగా ఉపయోగిస్తామే, అలాగే వారుకూడా ఆ చర్మాన్ని ఎంతో పవిత్రంగా ఎంచుకుంటారు. రాక్షస పాత్రలకు, దుష్ట పాత్రలకు ఇంకా మిగిలిన చిల్లర పాత్రలకు మేక చర్మాన్ని ఉపయోగిస్తారు. ఈ విధంగా పాత్రల పవిత్రతను బట్టి చర్మాలను వుపయోగిస్తారు.

బొమ్మల సౌందర్యం:

పైన వుదహరించిన చర్మాలను సేకరించి చక్కగా శుద్ధి చేసి, చర్మంలో వున్న దుర్వాసన నంతటినీ పోగొట్టి, వారికి కావలసిన బొమ్మల సైజుకు చక్కగా గీత గీసి దానిని సొంపుగా కత్తిరించి చిత్ర విచిత్ర మైన రంగులను అద్దుతారు. రంగుల్ని అద్దడంలో కూడ పాత్ర ఔచిత్యాన్ని బట్టే రంగుల్ని చిత్రిస్తారు. ప్రథమ, మద్యమ, ఉత్తమ పురుష లక్షణాలతోనూ, పద్మిని, చిత్తిని, శంకిని మొదలైన నాయకీ, నాయకులకుండే భేదాలను రంగుల్లో చిత్రిస్తారు.

ముఖ్య పాత్రలు అంటే ప్రదర్శనంలో చివరంటా వచ్చే పాత్రలు, ఆయా రంగాలలో ఘట్టాల ననుసరించి ఒకే పాత్ర నాలుగు రకాలుగా తయారు చేసుకుంటారు. ఉదాహరణకు __ బాల్యంలో రాముడు, అడవిలో రాముడు, యుద్దంలో రాముడు, పట్టాభిరాముడు, ఈ విధంగా ఆయా దశల ననుసరించి చిత్ర్రాలను తయారు చేసుకుంటారు.