పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/183

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాంతాలలో కుత్తాడీ లనే నట్టువ జాతివారు, బళ్ళారి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో బలిజలు, విశాఖ జిల్లాలో ఈటె బొందలీ తెగల వారు, గోదావరి మండలంలో తెలుగు గొల్లలూ, గుంపు తెగలవారు, జంగాలు మొదలైనవారు కూడ వున్నారు.

బొమ్మలాటల వారి కేంద్రాలు:

ఈ బొమ్మలాటల కుటుంబాల వారి నివాసాలు ఆంధ్ర దేశంలో విశాఖ పట్టణం జిల్లాలో సర్వసిద్ధి,శృంగవరపు కోట, కళ్ళేపల్లి ఆగ్రహారం, గోదావరి జిల్లాలో మండపేట, అంగర, ఎలమంచిలి, తణుకు, నెల్లూరు జిల్లాలో సింగరాయ కొండ, కర్నూలు జిల్లాలో రాయదుర్గం, బెళగల్లు, అనంతపురం జిల్లాలో కడమల కుంట, అవులన్న, జరుట్ల రామపురం, బళ్ళారి జిల్లా సొండూరు. తోరణగల్లు, బొమ్మలాట పల్లి మొదలైనవి. ఆ ప్రాంతాలలో బొమ్మలాటల వారు ఎక్కువగా వున్నారు. కాకినాడ వద్ద మాధవ పట్నంలో మాత్రం ఈ కుటుంబాలవారు చాల మంది వున్నారు.

బొమ్మలాట పల్లి:

బొమ్మలాట లాడేవారు ఎక్కువ మంది వుండడం వల్లనే ఈ గ్రామానికి బొమ్మలాట పల్లి అనే పేరు వచ్చింది. బొమ్మలాట పల్లి బళ్ళారి జిల్లాకు చెందిన గ్రామం.

ఇక్కడున్న బొమ్మలాట వారిలో మహారాష్ట్ర వాసనలు చాల వున్నాయి. వీరిని బొందలీ క్షత్రియు లంటారు. గంధోలి అనే శబ్ద వికృతే బొందలీ అని కూడ వాడుక వుంది. ఈ నాటికీ వీరు బొమ్మలాటల్ని ప్రదర్శిస్తున్నారు.

ముఖ్యంగా వీరు ప్రదర్శించే కథా ఇతివృత్తాలు భారత రామాయణ గాధలకు సంబంధించినవి. లంకాదహనం, మైరావణ చరిత్ర, ఇంద్రజిత్తు వధ, యయాతి కథ, కీచక వధ, దుశ్శాసన కథ, ప్రహ్లాద చరిత్ర, రంగనాథ రామాయణం మొదలైనవే కాక, దేశీయ కథలైన దేసింగు రాజు కథ, పల్నాటి వీర చరిత్ర, కరెభంటన కథ , కుమార రాముని కథలను కూడ ప్రదర్శిస్తూవుంటారు.