పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/137

ఈ పుట ఆమోదించబడ్డది

బహురూపాల బుహురూపం

105


ఎందరో ఇచ్చిన వివరణలు:

16 వ శతాబ్దానికి చెందిన ఎడపాటి ఎఱ్ఱన తాను వ్రాసిన "మల్హణ చరిత్ర" ద్వితీయాశ్వాసంలో__

చారణ బాగడ చర్చరీ బహురూప మండలాపాదిక ఖాండికములు అని బహురూపాన్ని ఒక ఖాండిక విశేషంగా పేర్కొన్నాడు.

అలాగే అయ్యలరాజు నారాయణకవి తన "హంస వింశతి" లో బహురూపమునూ దానితోపాటు ఖాండికమును షోడశ విధాలైన నృత్యాలుగా పరిగణించాడు.

క్రీ॥శే॥ మానవల్లి రామకృష్ణ కవి తన రచన "భరతకోశం" లో బహురూపాన్ని గూర్చి,

దేసీనృత్తం, నానా వేషధరం, యత్తద్వ బహురూప మితీరితమ్__ అని భరత కోశం 4|8 పుటలో నిర్వచించారు.

బహురూపమంటే కొందరు దానిని ఏక పాత్రభినయంగా భావించారు. ఏక పాత్రాభినయం అంటే__ ఒకే వ్వక్తి విభిన్న మనస్తత్వాలను అభినయించటంగా భావించవచ్చు.

తాను పాత్రధారియై ఆ యా పాత్రల స్వరూప స్వభావాలను అభినయించటంగా ఎంచవచ్చు. ఇందుకు ఉదాహరణ, హరిదాసులు వారి కథాగానంలో వివిధ పాత్రలను అభినయించి నట్లు,

అందుకు ఉదాహరణ అర్థనారీశ్వర పాత్రనూ, దశావతారాలు మొదలైన వేషాలను ప్రదర్శించే పగటి వేషధారులను మనం బహురూప ప్రదర్శకులుగా ఎంచవచ్చు.

బహురూపమంటే రూపాన్ని మార్చటమే కదా .... అంటే ఊసరవెల్లి లాంటిది.

బహురూప మంటే ఇంద్రజాలికుడనే అర్థం కూడ ఇచ్చారు. కాని ఇది బహురూపానికి సరిపోని నిర్వచనం.

ఈ బహురూపం ఒక్క ఆంధ్ర దేశంలోనే కాక, మైసూరు, బెంగాల్, మహారాష్ట్ర మొదలైన రాష్ట్రాలలో బహురూపం ఏదో ఒక రూపలో బహుళ వ్యాప్తి చెందిందని మనం ఊహించవచ్చు.