ఈ పుట ఆమోదించబడ్డది

ఎఱ్ఱగుడిపాడు శాసనము

ఇచట 'కొట్టము'అనునది బోయకొట్టము వలె నొక దేశవిభాగమని చెప్పి ఆవిభాగములోని భూమిని దానము చేసిరని దీనిని ప్రకటించినవారు చెప్పిరి. కాని 'కొట్టంబు 'అనునది రాజనగరమను చెప్పి అందుండు ఒకపాఱకు (బ్రహ్మణునికి) దానమొసగిరి యనుట బాగుండును.లేకున్నచో ప్రతిగ్రహీతయగు బ్రాహ్మాణుని పేరుచెప్పలేదు,సరికదా ఆయన నివాస స్థలముకూడ చెప్పబడ కపోవును.ప్రతిగ్రహీతల నివాస స్థానములు సాధారణగా శాసనాల్లో చెప్పుట కలదు.అయితే యిచ్చినభూమిగల దేశ విభాగము నిర్దేశింపబడకుండుట లోపమగును కదా యనినచో యీ శాసనశిల యున్నదేశమే అదియగునని సరిపెట్టుకోవచ్చును.అట్లనేక శాసనాలు కలవు. బ్రాహ్మాణుని నివాసమే కొట్టము. ఇరువదియాదినాల్కు-అనునది సంఖ్యావాచకము. ఇరువది (రెండుపదులు)అది(=మొదటగల)నాల్కు(=నాల్గు) అనగా 20...4 అని పూర్వము శాసనాల్లో ೨೦ ముందువేసి కొంతవ్యవధి వదలి ೪ అంకెను వేయువారు.అట్లే మిగిలిన అంకెలను కూడవ్రాయువారు.కనుక ఇరువది మొదటగల నాలుగు అని వ్రాయబడెను. దశ, శత, సహాస్రాది స్థానములను బాగుగ వాడుట అప్పటికింకా చేతకాదనిపిస్తుంది. పదులస్థానములో సున్నను మాని ೨ మాత్రమే వేసి దగ్గరలో ೪ నువ్రాయుట తెలిసిన తరు వాత ఇరువదినాలుగు అని 'ఆది'ని వదలి వ్రాయుట నేర్చిరి.ఈ విధంగా మూడు వాక్యాలతో శాసనం పూర్తి అయినది. రాజును, దానము చేసిన రాజోద్యోగిని చెప్పుటకొక వాక్యము,సాక్షులను చెప్పుటకొక వాక్యము. ఏ వాక్యములోను సమాపక క్రియ లేదు.మూడు వాక్యములలోను ఇచ్చిన పన్నస అని క్రియాజన్య విశేషణముతోనే కర్మ నిర్దేశింపబడినది. అయిన ను పైజెప్పిన సందేహాలు ప్రతిగ్రహీత పేరులేకుండట,కొందరి సాక్షుల పేర్లు లేకుండుట, మున్నగు లోపములు కొన్ని శాసనంలో కలవు. రచనలో తప్పులు లేవనవచ్చును.

ఇవి కొత్తగా భాష నేర్చుకొనేవారి వాక్యములు.ప్రథమా విభక్తిలో ఏక వచన బహువచనములు.'పాఱకు ' 'రాజుల్ల ' అనునవి కలవు. సప్తమిలో 'కొట్టంబున' అని యున్నది. ఇంతకుమించిన విభక్తి ప్రత్యయములు వాదబడ లేదు. అంటే వాక్యరచనను మెఱుగు పెట్టుటకై కారక విశేషము లంతగా వాడుట యింకా బాగుగ తెలియదనిపించును.