ఈ పుటను అచ్చుదిద్దలేదు

కవిత్వం నా కళ్ళజోడు

అది నా చెంత లేకపోతే అంతా మసక మసక
నింగి..నీరు నీలాలు కలసే చోటున సౌందర్యం బదులు
నెత్తుటి చుక్కలచారల..బీభత్సం
నా ముందున్న మనిషి వెంటాడే నీడై..
నను అభద్రతా భావనలోకి నెట్టుతాడు
అలికిన అక్షరాలు రెటీనా నంటినట్టు నాకంటికి
 నలకలై నకలై ఎంత నలిపినా అడ్డంగానే కనిపిస్తాడు
ఎదుటి వారంతా సాటివారు-తోటివారులా కాక
బోటిముద్దల్లా అగుపిస్తారు
ఒక నవ్వే నవ్వితే అదే తిరిగి అందేదేమో..
నొసలు ముడుచుకుని పెదాలు సాగదీస్తే.. ఈ వ్యక్తీకరణ
సభామర్యాదకు ఆమడ దూరమని
 నాభావంతో ఇమడక అంతదూరమూ జారిపోతారు..
వారు మరుగయ్యాకా.. నా ముందు ఓ జారుడు పదార్థమున్నట్టూ
అది వారిని వెనక్కి తేలేని బర్ముడా త్రికోణంలో కూరేసినట్టూ..
 అనుకుని అడుగైనా కదపకుండా
ప్రశ్నార్థకం నవ్వుతో నిలబడి ఉంటాను
ఎవరైనా ఏదైనా చూపిస్తే అది కళ్ళ డాక్టరు పరీక్షకోసం గలిబిలి చేసిన అక్షరాలేమోనని ప్రహేళికను నింపే పిల్లాడిలా
లోగుట్టును రట్టు చేద్దామని విఫలయత్నం చేస్తాను
ఎట్లా చూసినా నా కంటికి కలకే ..
పుసుగు పట్టిన కళ్ళతో చూసే వాడికి లోకం అంతా కంటకింపే
మారిన మార్పుని ఆకళించుకోలేని మనిషిని కదా!
అన్నీ తెలుసనుకుని ఏమీ తెలియకుండా ఉండలేక
అప్పుడప్పుడు కవిత్వం కళ్ళజోడుతో లోకాన్ని చూస్తాను..
ఇప్పుడంతా.. నాకు తెల్లకాగితం.. కింద మాత్రం నా సంతకం.