ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాతో ఆడవా..!

రాత్రి రహస్యాలు రసవత్తరంగా వుండవ్
తెల్లారితే మాటల తూటాలు రోజుకి ఎన్నిసార్లు పేలతాయో..
రెండు వైపులా తిట్ల గుళ్ల పెట్టెలు అక్షయ పాత్రలే
ఖండాంతర క్షిపణుల్లా పెళ్ళి పెద్దల పైకి పరోక్ష ప్రయోగాలు
కళ్లలో కంఠంలో జీర.. మనో విస్ఫోట అవశేషంగా ..
మదిలో కరెంటుండదు మాటల మధ్య మనుషులుండరు
చెలగాటాల కాపురాల్లో రాగం శృతి మించితే
వస్తువులపై అరుస్తూనో కన్నీళ్లకు తడుస్తూనో..
భరించడం వల్ల కాదన్నది ఇరువైపులా సాకు..
వేర్పాటు వాదం చెయ్యెత్తితే .. గుమ్మం దాటే మంతనాలు
ఒప్పందాలన్నీ చట్టుబండలే.. మధ్యవర్తిత్వం మాటచెల్లదు.
ఎవరో ఒకరు న్యాయ దేవత నిద్రను మళ్లా చెడగొడతారు
కసి మనుషుల పంతాలు పసిమనసుల కేరింతలు..
నెలకోసారి కోర్టు హాల్లో..
అమ్మ తోడుగా ఎడబిడ్డ అన్నకు కనిపించేది అక్కడే..
రాజీ లేనమ్మా, రుషి పుంగవుడూ పొరపొచ్చాల ప్రపంచంలో
ఆటల్లో సహోదరుల కేరింతలు.. సినిమా చూసినంత సేపే
కేసుల్లో పైచేయికై అమ్మానాన్నల కుస్తీలు,
కలిపే ముసుగుల్లో విడదీసే నల్ల కోట్లు
పిల్లల జీవితాల్తో పెద్దల చెలగాటాలు
బండెడు పుస్తకాల్లో ప్రశ్నలు ఇప్పుడు పెద్దగా బాధించవ్
వెలితిని నింపే స్నేహం కోసం.. గుండె చెరువయ్యే మాట
రోజూ బడి చివరి గంట మోగాకా.. చిన్నారి గుండె ప్రకంపనలు..

ఎన్నిసార్లు అంటాడో.. ఇంకెన్నిసార్లు అనాలని అనుకుంటాడో
తమ్ముడు కూడా లేడు.. . రావా మా ఇంటికి ..నాతో.. ఆడవా!!
(ఓ చిన్నారి స్నేహితునికి..; ఓ స్నేహితుని చిన్నారికి )