ఈ పుట ఆమోదించబడ్డది

ఏడవ కేంద్రములో ఏక అగ్రతగ నిలిచిపోయినపుడు శరీరమంత వ్యాపించి ఉన్న ఆత్మచైతన్యము శరీరభాగములనుండి ముకులించుకొని బ్రహ్మనాడి లోని కేంద్రములకు చేరిపోవుచున్నది. అట్లుచేరిన ఆత్మచైతన్యము క్రింది నుండి గబగబ పై కేంద్రములకు ప్రాకుచువచ్చుచున్నది. అలా ప్రాకుచు చివరకు ఏడవకేంద్రము చేరి అక్కడున్న మనస్సును లేకుండ చేయుచున్నది. అలా మనస్సు ఎప్పుడైతే లేకుండ పోవుచున్నదో అపుడు జీవుడు ఆత్మతో కలియుచున్నాడు. వేరుగనున్నవి ఒకటిగ కలిసి పోవడమును యోగము అంటాము. ఒకటిగనున్నవి వేరుగ విడి పోవడమును వియోగము అంటాము. విడి విడిగనున్న జీవాత్మ ఆత్మ రెండు ఒకటిగ కలసిపోవుచున్నవి కావున దానిని ప్రత్యేకించి బ్రహ్మయోగము అంటున్నాము.


బ్రహ్మనాడినుండి కేంద్రముల ద్వార శరీరమునకు ప్రాకు ఆత్మ చైతన్యమును కుండలీశక్తి అనికూడ అంటున్నారు. కుండలిని పాముగ పోల్చి చాలామంది చెప్పుచుందురు. ఎందుకనగ పాముకు బుసకొట్టు స్వభావముండును కదా! కేంద్రములోని కుండలీశక్తి ఊపిరితిత్తులను కదలించి బుసబుసమను శబ్దముతో కూడిన శ్వాసను నడుపుచున్నది కనుక బుసకొట్టు పాముగ చెప్పారు. మనస్సు పైకి చేరిన వెంటనే కేంద్రములకు చేరిన శక్తి ఒక్కొక్క స్థానమునుండి పైకి ప్రాకుచు పోవుచున్నది. దానినే ఈ చరణములో కుప్పిగంతులేసి అన్నారు. పైకి ఎగసి పోయిన పాము అనబడు శక్తి పైన చేరిన మనస్సును లేకుండ చేయుచున్నది. దానినే పాముకరచి మ్రింగెరా అన్నారు. అప్పటివరకు జీవాత్మకు ఆత్మకు మద్యన అడ్డముగనున్న మనస్సు లేకుండ పోవుటచేత జీవాత్మ ఆత్మలో చేరిపోవుచున్నాడు. ఆత్మ జీవాత్మల సంధానమను యోగము ఈ చరణములో చెప్పబడినది. మీకు బాగ అర్థమగుటకు