ఈ పుట ఆమోదించబడ్డది

సంతతి కలగాలంటే వారిలో జ్ఞానమనే భీజము పడాలి. జ్ఞానమనేది టీవిలలోను, రేడియోలలోను ఎక్కడైన గురువులవద్దను విన్నప్పటికి ఆసక్తిలేని వారికి అది ఫలించదు, అనగ బుర్రకెక్కదు. ఎంతో మంది అజ్ఞానులలో ఒక్కడైన జ్ఞానుల సాంగత్యములో జ్ఞానమును విని దానిమీద ఆసక్తి పెంచుకొంటే వానికి జ్ఞానభీజముపడినట్లే. అటువంటివాడు కొంత కాలమునకు యోగి కాగలడు. అజ్ఞానమనే గొడ్డుతనము కల్గి యోగమనే సంతతిలేనివానికి జ్ఞానభీజము పడినపుడు అజ్ఞానము అను ముట్టు నిలిచిపోవును. జ్ఞానభీజము పడినవానికి కొంతకాలము వరకు గర్భము పెరిగినట్లు జ్ఞానము పెరిగి యోగము అను పుత్రున్ని పొందగలడు. పుట్టిన వారిలో కొడుకు పుట్టవచ్చు లేక కూతురు పుట్టవచ్చు. జ్ఞానము కల్గినవాడు కొంతకాలమునకు కర్మయోగి అయితే కూతురు పుట్టినట్లే అట్లుకాక కొడుకు పుట్టినట్లయితే బ్రహ్మయోగిగా లెక్కించుకోవలయును.


భూమి మీద బ్రహ్మయోగి అయినవాడు మనస్సును జయించు సాధన చేసి మనస్సును జయించును. ఎన్నో సంకల్పములతో కూడుకొన్న మనస్సును ఏ ఒక్క ఆలోచన చేయనీక శూన్యముగ ఉంచడమును బ్రహ్మయోగము అంటాము. శరీరమునకున్న ఐదు జ్ఞానేంద్రియములైన కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము యొక్క ప్రస్తుత విషయములనుగాని, జరిగిపోయిన, జరుగబోవు విషయములనుగాని యోచించకుండ ఉండడమును బ్రహ్మయోగము అంటాము. ఇక్కడ కొందరికి ఒక ప్రశ్న రావచ్చును. అదేమనగా ఒక గురువువద్ద ఉపదేశమంత్రమును తీసుకొని దానిని ధ్యానించుచున్నపుడు, అది ఇంతకు ముందు విన్నదగును కదా! జరిగిపోయిన చెవుకు సంబంధించిన విషయముకదా! ఇది ఇంద్రియ విషయమగుట వలన చేసేది ధ్యానము కాదంటామా? అని అడుగవచ్చును.