ఈ పుట ఆమోదించబడ్డది

చర్మమని అర్థము చేసుకొన్నపుడు రెండవ చరణములోని రహస్యము సులభముగ అర్థము కాగలదు. చూచుటకు విచిత్రముగ చిలకలు, కోతులు, అడవి అని వ్రాసిన ఈ వాక్యములో ఎంతో జ్ఞానము ఇమిడి ఉన్నది.


 3) ముట్టు తప్పి గొడ్డురాలు మహిళకొక్క కొడుకు పుట్టి
గొప్పకొండలేడు మ్రింగి గురకపెట్టెరా || గుట్టు||

మానవులలో పూర్వము వెయ్యింటికొకడు అదియు అరుదుగ జ్ఞానము మీద ఆసక్తి కల్గియుండెడివారట. నేటి కాలములో లక్షమందిలో ఒక్కనికి జ్ఞానము మీద ఆసక్తియుండడము అరుదే అని చెప్పవచ్చును. రెండు మూడు లక్షలకు ఒకడు జ్ఞానము మీద ఆసక్తియున్నవాడు దొరికినప్పటికి వాడు చివరి వరకు జ్ఞానము తెలుసుకుంటాడను నమ్మకము లేదు. దీనిని బట్టి చూస్తే కడవరకు జ్ఞానాసక్తి కల్గియుండువాడు కొన్ని లక్షలకు ఒకడు దొరుకునని తెలియుచున్నది. బహుశ పదిలక్షలకు ఒకడు దొరికితె పదిలక్షలమంది అజ్ఞానులుంటారన్నమాట. అంతమందిలో జ్ఞాని అయినవాడు కర్మయోగము, బ్రహ్మయోగము అను రెండు యోగములలో ఏ యోగమునైన అనుసరించవచ్చును. ఒక వేళ బ్రహ్మయోగమును అనుసరించాడని అనుకొందాము. అతడు బ్రహ్మయోగి అగును. ఇంత వరకున్న వివరమును పై చరణములో ఏ విధముగ వివరించారో చూద్దాము. గొడ్డురాలు అనగ పిల్లలు పుట్టనిదని అందరికి తెలియును. గొడ్డురాలుకు పిల్లలు పుట్టకున్న ముట్టు అనునది ప్రతి నెల ఉండనే ఉండును. అజ్ఞానికి జ్ఞానము కలుగుట దుర్లభము, పది లక్షలమందికి కూడ ఒకడు దొరుకుట అరుదు అనుకొన్నాము కదా! అజ్ఞానిని గొడ్డురాలుగ పోల్చి వారికి జ్ఞానము అను సంతతి కలుగదు అన్నారు.