ఈ పుట ఆమోదించబడ్డది

మనస్సును పాముగ వర్ణించి వాటినుండి హాని కలుగుచున్నదని తెలుపుటకు ఈ తత్వములో "ఐదు తలల పాము విషముతో బాధపడే మాకు" అన్నాడు.


విషమునకు విరుగుడు ఔషదము. మనస్సనెడి పాము పడగల విషమునకు మామూలు మందు సరిపోదు దానికి జ్ఞానమనే మందే విరుగుడు కావున "బోధామృతమనే మందిమ్మని కోరితిమి" అని అన్నారు. దీనిని బట్టి విషయములలో విషమున్నదోయన్న అని కొందరన్నారు. ఇప్పటినుండి విషయములపట్ల బహు జాగ్రత్తగ ఉండవలెను.


 3) ఏడు కొండలు ఎక్కే మార్గము తెలియని మాకు
కంటకములు లేని మార్గము తెలుపమని కోరితివిూ || శ్రీ గురు||

పూర్వకాలములో మొట్టమొదట తయారైన దేవాలయము శివలింగము కలది. తరువాత రెండవది రూపము కల్గిన నామాలప్రతిమ. ఒకటి నిరాకారమైన పరమాత్మకు గుర్తు, రెండవది సాకారమైన భగవంతునికి గుర్తని "దేవాలయ రహస్యములు" అను పుస్తకములో తెలుసుకొన్నాము. మనిషిలో దైవజ్ఞానము వృద్ధి అగుటకు ఈ రెండు దేవాలయములు అవసరమని ఆనాటి జ్ఞానులు వీటిని నిర్మించారు. దైవజ్ఞానము తెలియుటకు ఆనాడు ఎంతో యోచించి సూత్రబద్దముగ, శాస్త్రబద్దముగ తీర్చిదిద్ది తయారు చేయబడినవే రెండు దేవాలయములు. పూర్వము విభూతి రేఖలున్న లింగము, మూడు నామములున్న ప్రతిమ దేవాలయములు తప్ప ఇతర దేవాలయములుండేవి కావు. తర్వాత కొంత కాలమునకు ఈ రెండు దేవాలయముల యొక్క జ్ఞానము వివరము తెలియకుండ పోయినది. వాటి విశేషతను గురించి చెప్పువారు లేకుండపోయారు. ఇటువంటి పరిస్థితిలో మాయకు మంచి అవకాశము ఏర్పడినది. మాయ ప్రేరణతో మనుషులలో అజ్ఞానము పెరిగిపోయినది.