ఈ పుట ఆమోదించబడ్డది

కావున జ్ఞానము ప్రకారము శరీరములోపల జీవుడు 24 మందితో కాపురము చేయుచున్నాడు. అనగ రెండు డజన్ల సహచరులతో జీవుడు కాపురము చేయుచున్నాడు. బయటి కాపురము ఎంతమంది ఉండిన లోపలి కాపురము మాత్రము 24 మందితోనే అని చెప్పవచ్చును. శరీరములో తనతోపాటు కాపురమున్నవారే జీవునికి నిజమైన సంసారము. అంతరంగములోని సంసారమును వదలడమే నిజమైన సన్యాసమని భగవద్గీతలో కూడ తెలియబరచబడినది. శరీరములోపల మనస్సు, బుద్ది, చిత్తము, అహము, అలాగే ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, ఐదు వాయువులు, ఐదు తన్మాత్రలు అని మొత్తము 24 తోటి జీవుడు ఉంటూ జీవయాత్ర సాగిస్తున్నాడు. శరీరాంతర్గతములో గల 24 భాగములతో జీవుడు సంబంధము పెట్టుకోకపోవడమే నిజమైన సన్యాసము. దీనివలన యోగప్రాప్తి మోక్షప్రాప్తి కల్గును. అట్లుకాక బయటి వారిని వదలితే లోపలి కర్మతెగదు, మోక్షము లభించదు. పూర్వము స్వాములుగాని, నేటి స్వాములుగాని బాహ్య సంసారమును వదలడము వలన మూడు గుణములు వదలవు. కావున వారు సన్యాసులు కాదని తెలియుచున్నది. అందువలన ఈ తత్త్వములో "సన్యాసమంటు భార్య పిల్లలు వదలి పొయ్యేరు, సన్యాసమందు సారము తెలియని మూఢులెల్లరు మూడు కాల్వలు దాటలేరయ్యా" అని అన్నారు. ఇప్పటికైన తత్త్వములోని అర్థము తెలిసి నిజమైన సన్యాసము తీసుకొందాము.


 6. రాగముల భజన చేయపూనేరు - సన్మార్గులను లెక్కచేయక మాటలాడేరు
భజనలోని మర్మమెరుగక - సన్మార్గులలోని జ్ఞానమెరుగని మూఢలెల్లరు ||మూడు కాల్వలు||