ఈ పుట ఆమోదించబడ్డది

ఎటువంటి బోధలు చెప్పువారైన బాధగురువులే అగుదురు. శరీరమునకు మనస్సుకు పనిలేని బోధలు చెప్పువారే బోధగురువులగుదురు. శరీరము, మనస్సు పనులలో లగ్నమైనపుడు ప్రపంచమే తెలియును కాని ఆత్మ తెలియదు. బయట శరీరము, లోపల మనసు పనిని మానుకొన్నపుడే ఆత్మ తెలియబడు బ్రహ్మయోగమగును. అట్లుకాక వ్రతక్రతువులు, యజ్ఞ యాగములు, వేదాపఠనములు, దానములు, మంత్రబోధతో కూడిన తపస్సులను బోధించువారు బాధగురువులే అగుదురు. అందువలననే భగవద్గీతలో కూడ యజ్ఞముల వలన, వేదాధ్యాయణము వలన, దానము వలన, తపస్సుల వలన దేవుడు తెలియబడడని విశ్వరూప సందర్శన యోగమను ఆధ్యాయములో 48వ శ్లోకమున మరియు 53వ శ్లోకమున చెప్పబడియున్నది.


ఈ విధముగ బాధ బోధ గురువులుండగ జ్ఞానమును తెలుసు కోవాలనుకొన్న ప్రజలు గురువులను గుర్తించలేక, జ్ఞానములోని తారతమ్యములు తెలియక ఆధ్యాత్మికవిద్యలో ఘోరముగ మోసపోవుచున్నారు. అట్లు మోసపోయినవారు తాము తెలుసుకొన్నది బాధబోధ లేక ఆత్మబోధ అని తెలియక, తమకు అంతా తెలుసునను అహముతో దేవున్ని దేవుని జ్ఞానము పూర్తిగ తెలుసునని చెప్పు కొంటున్నారు. ఇటువంటివారు ఎప్పటికి తమలోని ఆత్మను తెలియలేరు. అందువలన ఈ తత్త్వములో "బాధ గురువుల పంచచేరేరు, బోధ తెలియక ఘోరముగ మోసపొయ్యేరు, బోధలోని జ్ఞాన మెరుగక తత్త్వమంత తెలుసునను మూఢులెల్లరు మూడు కాల్వలు దాటలేరయ్యా " అన్నారు.


 4. వేదమంత్రములు గొనుగ నేర్చేరు - బాహ్యయజ్ఞములు చేయపూనేరు
మంత్రములోని మర్మమెరుగక - యజ్ఞములోని చావ తెలియని మూఢులెల్లరు ||మూడు కాల్వలు||