ఈ పుట ఆమోదించబడ్డది

అడ్డమైనట్లు, దైవమార్గములో పయణించు వానికి మూడు గుణములు దాటలేని మూడు కాల్వలుగ అడ్డమైవున్నవి. మూడు గుణములను జయించడము దుస్సాద్యమైన పనియని భగవద్గీతలో కృష్ణుడు కూడ " గుణమయి మమ మాయా దురత్యయా " అన్నాడు. గుణరూపములో ఉన్న మాయను దాటడము దుస్సాద్యమైన పని అని దీని అర్థము. తామస, రాజస, సాత్త్వికమను మూడు గుణములనే ఈ తత్త్వములో మూడు కాలువలన్నారు. కొంత జ్ఞానమున్నవారే దాటుటకు సాధ్యముకాని గుణములను జ్ఞానములేని మూఢులు ఏమాత్రము దాటలేరు. కావున మూడు కాల్వలు దాటలేరయ్యా ఇల మూఢజనులు మూడు కాల్వలు దాటలేరయ్యా అన్నారు.


 1. ఓడ లేకను ఈద బొయ్యేరు - సంసారవారధిలో జాడ తెలియక మునిగిపొయ్యేరు
ఆత్మజ్ఞానమను ఓడనెక్కి - ఏడుకొండలు దాటలేని మూఢులెల్లరు ||మూడు కాల్వలు||

ఒక నదిని దాటుటకు చిన్న తెప్ప అవసరము. అట్లే సముద్రమును దాటుటకు ఓడ అవసరము. సంసారమను అతిపెద్ద సముద్రమును దాటుటకు బలమైన జ్ఞానమను ఓడ అవసరము. ఇప్పటి కాలములో ప్రజలు ఏమాత్రము జ్ఞానములేనివారై సంసారసాగరమును ఈదబోయి దానిలోనే మునిగిపోవుచున్నారు. సంసారమునుండి గట్టెక్కవలయునంటే ఆత్మజ్ఞానమను ఓడ అవసరము. ఆత్మజ్ఞానమును తెలిసిన వాడు సంసారములో ఉండినప్పటికి దాని చిక్కులలో చిక్కుకొనక అంతరంగము లోని ఏడుకొండలనబడు సప్తనాడీకేంద్రములను దాటి అవతలనున్న ఆత్మను తెలియగలడు. ఈ విషయమును తెలియజేయుటకు పై తత్త్వములో "ఓడలేకను ఈదబొయ్యేరు సంసారవారధిలో జాడ తెలియక మునిగి పొయ్యేరు