ఈ పుట ఆమోదించబడ్డది

4. భూములు అడవులు తిరుగుచునుంటే బుద్దులు చెడునుర ఒరేయొరే
బుద్దిలోయుండే పున్నమిచంద్రుని చూచుచునుండుట సరే సరే ||చి||

ఎంతోమంది దైవభక్తి కల్గినవారు గలరు. వారికి దైవభక్తి ఉంది కాని దేవుడెవరని తెలియదు. అట్లు తెలియక పోవడము వలన తీర్థయాత్రలను పేరుతో ఎందరో దేవుల్లను దర్శించుచుందురు. ఎన్నో పుణ్యక్షేత్రములను చూచుచుందురు. ఈ విధముగ చేసినప్పటికి అసలైన జ్ఞానము తెలియదు, అసలైన దేవుడు తెలియబడడు. తీర్థయాత్రలచే పుణ్యక్షేత్రములను దర్శించుట వలన పుణ్యమొచ్చునేమోకాని జ్ఞానము మాత్రము రాదు. అవి కేవలము పుణ్యక్షేత్రములు మాత్రమే, కాని జ్ఞాన క్షేత్రములు కాదుకదా! భూమి మీద కొన్ని క్షేత్రములను దర్శించి దైవదర్శనము చేసుకొన్నామనుకొనుట శుద్దపొరపాటు. నిజదైవము కొన్ని పుణ్యక్షేత్రములలోనే కాక భూగోళమంతయు నిండియున్నాడు. దేవుడు బాహ్యముగ తెలియువాడు కాడు, కనుక శరీరమను క్షేత్రములోపలే దర్శించుకోవలసియున్నది. ఆ విషయము మనకు తెలియుటకు ఈ తత్త్వములో భూములు అడవులు తిరుగుచువుంటే బుద్దులు చెడునుర ఒరే ఒరే అన్నారు. శరీరములోనే దైవము తెలియునని చెప్పుటకు బుద్దిలోవుండే పున్నమి చంద్రుని చూచుచునుండుట సరే సరే అన్నారు. ఈ తత్త్వమును చూచిన తరువాతయైన మనము బాహ్యముగనున్న భక్తిని వదలి అంతరంగములో భక్తిని కల్గి లోపలేయున్న దేవున్ని తెలియవలెనని తెలుపుచున్నాము.

-***-