ఈ పుట ఆమోదించబడ్డది

ఏడవకేంద్రములో మనస్సును నిలిపి బ్రహ్మయోగము పొందడమును గురించి చెప్పారు.


5. జంట త్రోవల రెండినంటి ఊదన్న
అంటి యూది మేన్మరచి యట్టే నిలువన్నా
మేను మరచి ఘంటానాదము వినుమన్న
నాదమువిని పోతులూరిని నమ్మియుండన్నా ||ఈ జన్మ||

శరీరములోని పెద్దనాడి అయిన బ్రహ్మనాడినుండి వచ్చు ఆత్మ చైతన్యము ఊపిరితిత్తులకు చేరి వాటిని కదలించి శ్వాస ఆడునట్లు చేయుచున్నది. శ్వాస రెండు ముక్కురంధ్రముల ద్వార ఆడుచున్నది. రెండు ముక్కురంధ్రములలో ఆడుచున్న శ్వాసను ప్రయత్నము చేసి కుంభకము అను సాధన ద్వార నిలబెట్టగలిగినపుడు శరీరములో అన్ని కదలికలు నిలిచిపోవును. శరీరమునంతటిని మరచి మనస్సు ఒకే ధ్యాసలో నిలిచిపోవును. అపుడు శరీరములోని ఆత్మ తెలియును. గంటానాదము ఏకస్థాయి శబ్దము కల్గియున్నట్లు ఒకే స్థాయిలో ఆత్మను తెలియువాడు నిజయోగి అగును. ఈ విషయమును చెప్పుచు రెండు ముక్కురంధ్రములలో శ్వాసను లోపలికి పీల్చినిలుపడమును జంటత్రోవల రెంటినంటి ఊదన్నా అన్నారు. శరీరము మీద ద్యాసలేకుండ మనస్సు నిలచి పోవడమును మేనుమరచి అట్టే నిలువన్నా అన్నారు. ప్రపంచ విషయములను వదలి నిలచిపోయిన మనస్సు ఆత్మను తెలియగల్గు చున్నది. కావున గంటానాదము వినుమన్నా అన్నారు. ఇట్లు శ్వాసద్వార బ్రహ్మయోగమును పొంది ఆత్మను తెలియు విధానమును ఈ తత్త్వములో వర్ణించి చెప్పారు.

-***-