ఈ పుట ఆమోదించబడ్డది

4

తెలుగు నవల

సంఘాన్ని ఈ నవల చాలా ప్రభావితం చేసింది. ఆ కాలంలో ఇటువంటి మౌలికమైన నవల వ్రాయడం పంతులుగారి ప్రతిభకు నిదర్శనం. స్త్రీ విద్య, స్త్రీ స్వాతంత్ర్యం, సమాజసౌభాగ్యానికి నాగరికతకు అత్యంతావశ్యకాలని వీరేశలింగం పంతులుగారీ నవలలో ప్రతిపాదించి ప్రబోధించారు.

ఈ నవలలో పంతులుగారు నాలుగు రకాలైన దాంపత్య జీవితాలను తులనాత్మకంగా ప్రతిపాదించి, ఎటువంటి దాంపత్యం, సంఘానికి మేలుకలగజేస్తుందో సిద్ధాంతీకరించారు. ఆలుమగలిద్దరూ చదువుకొన్నవారైతేనే అది అదర్శదాంపత్యమనీ, అనుకూల దాంపత్యమనీ ఆయన ప్రబోధం. స్త్రీ చదువుకొని పురుషుడు చదువురానివాడైన ఒక జంటను, భార్యాభర్తలిద్దరూ చదువుకొన్నవాళ్ళైన కాపురాన్ని, ఇద్దరూ చదువుకోని ఒక దాంపత్యాన్ని, భర్త విద్యావంతుడై, భార్య విద్యావిహీనురాలైన ఒక సంసారాన్నీ వీరేశలింగం ఇతివృత్తంగా తీసుకొని నలుగురు కొడుకులూ, నలుగురు కోడళ్ళ ఉమ్మడికుటుంబపు కష్టసుఖాలను మానావమాలను, మంచిచెడ్డలను, సత్యవతీ చరిత్రంగా రూపొందించారు. సత్యవతి కధానాయక, నారాయణమూర్తి ఆమె భర్త, వీళ్ళద్దరిదీ ఆదర్శ దాంపత్యం, సత్యవతి విద్యావంతురాలు.

ముంగొండ అగ్రహారంలో లక్ష్మీనారాయణరావు, యశోదమ్మలకు, వెంకటేశ్వర్లు, నారాయణమూర్తి, సుబ్రహ్మణ్యం రామస్వామి, అనేవాళ్ళు నలుగురు కుమారులు, వాళ్ళది అవిభక్తకుటుంబం. వెంకటేశ్వర్లు విద్యావంతుడు కాడు. అతడి భార్య సుందరమ్మ అతడికి తగిన ఇల్లాలు అంటే మూర్ఖాచారాలలోనూ మూడవిశ్వాసాలలోనూ ఇద్దరికీ పొంతన కుదిరించి. అవివేకపు పట్టుదలలూ అజ్ఞానపు ఈర్ష్యాద్వేషాల విషయంలో ఇద్దరూ ఒకరికొకరు తీసిపోరు. అందువల్ల కాడికికట్టిన ఎద్దులులా సంసారశకటాన్ని ఈడ్చుకొంటూ ఉంటారని వీరేశలింగం వర్ణించాడు. ఇద్దరూ చదువురానివాళ్ళైన భార్యాభర్తల దాంపత్యం ఇది. ఇక రెండోది ఇద్దరూ చదువుకొన్నవాళ్ళైన సత్యవతీ నారాయణమూర్తుల దాంపత్యం. నాలుగోజంట సూరమ్మ సుబ్రహ్మణ్యాలది. సుబ్రహ్మణ్యం చదువుకొన్న వాడైనా సూరమ్మ విద్యాగంధంలేని పశుప్రాయురాలు. దయ్యాలని భూతాలని, కేకలువేస్తూ కుటుంబానికి కష్టాలు కలిగించడం, ఇరుగుపొరుగులతో కలహాలు, ఈర్ష్యాసూయలతో ఇంట్లో వాళ్ళందరితో జగడమాడటం, సుబ్రహ్మణ్యం జీవితం నరకప్రాయమే చేస్తూ ఉంటుంది సూరమ్మ. మూడోకొడుకు