ఈ పుట ఆమోదించబడ్డది

తెలుగు నవల

3

రంగాఉన్న దురాచారాలు, అంధవిశ్వాసాలు, చిత్రించాడు. ఈ రాజశేఖర చరిత్రం మళ్ళీ ఇంగ్లీషులోకి అనువాదం పొందడం, అరవం, కన్నడం వంటి దేశీయ భాషల్లోకి అనూదితం కావడం, ఈ నవల ప్రశస్తికి తార్కాణాలు. 1887 వ సంవత్సరంలో రాజశేఖర చరిత్రం ఇంగ్లీషు అనువాదమైన 'ఫార్చూన్స్ వీల్ ' (అదృష్ట చక్రం)ను లండన్ టైమ్స్ పత్రిక గొప్పగా కొనియాడింది. 1887 కే తెలుగు నవల ఇటువంటి ఘన గౌరవం పొందటం తెలుగువాళ్ళు గర్వించదగిన విషయం. రాజశేఖరచరిత్రలో వీరేశలింగంపంతులుగారు సృష్టించిన పాత్రలన్నీ సజీవమైన పాత్రలు 'రాజశేఖరుడుగారి గృహ వర్ణనము ఇంచుమించుగా మాగృహవర్ణనమే ' అని పంతులుగారు స్వీయ చరిత్రలో వ్రాశారు. ధవళేశ్వరంలో భూస్వామి అయిన మధ్యతరగతి సంపన్నగృహస్థు రాజశేఖరుడు. ఆయన చుట్టూచేరి ముఖస్తుతులు చేస్తూ పురోహితులూ, పూజార్లూ, వైద్యులూ, యాచకులూ, పాచకులూ డబ్బుగుంజుతూ ఉంటారు. స్వర్ణవిద్య నేర్పుతానంటూ ఒక బైరాగి వచ్చి రాజశేఖరుడితో ఇంట్లో తిష్టవేసి, నమ్మించి ఇంట్లోఉన్న వెండిబంగారాలు సంగ్రహించి పారిపోతాడు. దాంతో రాజశేఖరుడు నిర్ధనుడవుతాడు. లోకంపోకడ అంతా ఆయనకు బాగా తెలిసివచ్చి, కనువిప్పు కలుగుతుంది. దారిద్ర్యయం అనుభవించడంవల్ల ఎంతో లోకానుభవం సంపాదిస్తాడు.

భూస్వామ్య వ్యవస్థపట్ల ఆకర్షణ సాహిత్యంలో తగ్గిపోతూ ప్రజాస్వామ్య వ్యవస్థ అభిముఖ్యం ఏర్పడుతున్న తొలినాళ్ళ విశిష్టరచన రాజశేఖర చరిత్రం. రాజశేఖర చరిత్రకు ఇంకొక పేరు వివేకచంద్రిక. ఈ నవలకన్నా ఆరేళ్ళకు ముందే వెలువడ్డ శ్రీరంగరాజ చరిత్రకు కూడా ఇంకోపేరుంది, 'సోనాబాయి పరిణయం ' అనేది. తొలినాళ్ళలో ప్రతి నవలకూ రెండుపేర్లుండేవి. ఇది గమనించదగ్గ అంశం. వీరేశలింగం ఈ నవల కాక ఇంకా రెండు మూడు నవలలు వ్రాశాడు. తెలుగులో మొట్టమొదటి సాంఘిక నవల వ్రాసింది ఆయనే. అది సత్యవతి చరిత్రం. ఇది 1883 లో వెలువడింది. వీరేశలింగం ప్రత్యేకించి స్త్రీలకోసం ఒక మాసపత్రిక నడిపాడు. ఆ పత్రిక పేరు సతీహితబోధిని. ఈ పత్రికలోనే ఆయన సత్యవతీ చరిత్ర మనే సాంఘిక నవలను వరసగా కొన్ని సంచికలలో ప్రకటించి పుస్తకరూపాన తరవాత తెచ్చాడు. ఇవాల్టి దృష్టికి శిల్పం దృష్ట్యా ఈ నవల పేలవంగా కన్పించినా ఇతివృత్తాన్ని బట్టి, సాంఘికప్రయోజనాన్నిబట్టి, దీనిని చాలా గొప్ప నవలగా పరిగణించాలి. అదీకాక ఆ కాలపు