పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/420

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

365


క. భూసురపుణ్యాహధ్వని
భాసురవీణామృదంగపటహధ్వని యా
రాసుతుల కంకణధ్వని
భూసురవర్త్మములు నిండి భోరున మ్రోసెన్.

156


చ.

సరఁగున లగ్నకాల మదె సన్నిహితించె నటంచు నద్ధరా
మరులు వచింప రాముఁ డభిమన్యునకు న్విధియుక్తిగా మహా
చరణసుఖాసనార్ఘ్యమధుపర్కసుగంధసుమాక్షతాదిస
త్పరిణయమంగళార్థహితపద్ధతిఁ బూజ లొనర్చి యంతటన్.

157


ఉ.

తోడనె పెండ్లికూఁతు నిట దోడ్కొనిరమ్మని యాజ్ఞ సేయఁగా
చేడియలెల్ల కౌతుకముచే శశిరేఖను జేరి కూర్మి యా
మ్రేడితమై జిలుంగలరు మేలిముసుంగు ఘటించి యారతు
ల్వేడుక బాడుచు న్సుమణివేదికకుం గొనితెచ్చు నంతటన్.

158


చ.

వలపుమెఱుంగు క్రొన్నెఱుల వన్నెలచె న్నలరారు నెన్నొస
ల్తిలకము రంగెసంగ ముయిదేఁట మిటారఁపుఁ గప్పురంపు మే
ల్కలపము తావి ఘుమ్ము రనఁగా సరిగంచుల చల్వపల్వ చిం
గులు దొలకింపఁగా బలునికూఁతును దోడుక వచ్చి రంతయున్.

159


సీ.

నూత్నకాంచనదీప్తి రత్నభూషణకు నె
        మ్మేనికాంతి వన్నియల నొసఁగ
కందర్పసాయకాకరనేత్రద్యుతు
        ల్గండద్వయంబులఁ గాంతి నింప
తరళకాంతిస్ఫురత్తారహారమ్ములు
        గుబ్బచన్నులఁ జెలంగుచు నటింపఁ
బదసరోజన్యాసవద్యసమీచీన
        ధాత్రి లాక్షారసచిత్ర మెనయ