ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొలిపలుకు

ఒకప్పుడు లధ్యమై, ఇప్పుడు దొరకని కొవ్యాలను ప్రచురించడమే కాకుండా, ఇంతవరకు అచ్చుకాని కావ్యాలను కూడా, వెలువరించాలనే ఉద్దేశం సాహిత్య అకాడమీకి ఉన్నది. ఈ దృష్టితోనే 'తాలంకనందినీ పరిణయా'న్ని ఇప్పుడు ముద్రించింది.

ఆసూరి మరింగంటి వేంకట నరసింహాచార్యుల "తాలాంక నందినీ పరిణయము” దాదాపు నూరేళ్ళ క్రితము రచింపబడినదే అయినా తొలిసారిగా ఇప్పుడు ముద్రణను అందుకున్నది. మరింగంటి వంశంవారు సంస్కృత ఆంధ్ర భాషలలో అశేష పాండిత్యాన్ని సంపాదించి అనేక సాహితీ ప్రక్రియా రచనల్లో తమ ప్రతిభా పాండిత్యాలను ప్రదర్శించి సాహిత్యాన్ని, భక్తితత్వాన్ని తెలుగులో ప్రచారము చేసినవారు.

'తాలాంక నందినీ పరిణయము' రసవత్ప్రబంధం. అందమైన పదబంధాలతోనూ, చమత్కార జనకమైన శబ్ద, అర్థ అలంకారాలతోనూ, చిత్రబంధ కవిత్వాలతోనూ, చక్కని జాతీయాలతోనూ, మాండలిక ప్రయోగాలతోనూ, యీ కావ్యం ప్రౌఢ సాహిత్యానురక్తులందరికీ ఆమెతలిస్తుంది. ఈ భూమిలో ఎందాకా రామాయణం ఉంటుందో, అందాకా ఈ కావ్యం ఉంటుందని గుండె నిబ్బరంతో ఈ కవి చెప్పుకున్నాడు.

దొరికినన్ని ప్రతులను పరిశీలించి ఈ కావ్యాన్ని పరిష్కరించి, చక్కని పీఠిక సమకూర్చి అందించిన శ్రీ శ్రీరంగాచార్యులకు అకాడమీ పక్షాన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

హైదరాబాదు,
1-8-1980. ఇరివెంటి కృష్ణమూర్తి, కార్యదర్శి