పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/19

ఈ పుట ఆమోదించబడ్డది



స్వీయ చరిత్రము

రెండవ భాగము

మొదటి ప్రకరణము

పురమందిరాదిక నిర్మాణదశ. (1890 మొదలు 1900 వఱకు)

1879వ సంవత్సరమునందు వితంతువివాహ విషయమున నేనియ్యఁదలఁచుకొన్న కొన్ని యుపన్యాసములకు తావొకపట్టున లభింపకపోయి నప్పటి నుండియు సర్వజనులకు నుపయోగవడెడి యుపన్యాస సభాభవన మొకటి పట్టణమున కుండిన బాగుండునుగదాయన్న సంకల్పముతో తత్సిద్ధియెట్లు కలుగునా యని యూలోచించుచుంటిని, మా యుత్తర మండలములలో కొంతకాలము పాఠశాలా పరీక్షకులుగా నుండినట్టియు, తెలుఁగుదేశముపయి నధికాభిమానము కలవారయి యుత్తరమండలములనుండి పట్టపరీక్షయందును తదభావమున ప్రథమశాస్త్ర పరీక్షయందును కృతార్థతను బొందినవారిలో నగ్ర స్థానమును బడసినవారి కేఁటేఁటబంగారు పతకమునిచ్చుట కేర్పాటుచేసినట్టియు, తరువాత చెన్నపురి రాజధానిలోని పాఠశాలల కెల్ల విద్యావిచారణ కర్తయయి యుపకారవేతనమును బడయనున్నట్టియు కర్నల్ మక్డానల్డుగారిపేర రాజమహేంద్రవరములో పట్టణ మందిరమును కట్టింపవలెనని 1880 వ సంవత్సరములో ప్రయత్నించితిని. ఆ సంవత్సర మాగష్టు నెల 15వ తేదిని జరగిన పురజనులసభలో మక్డానల్డు దొరగారిపేర పురమందిరము కట్టింప నిశ్చ యింపఁబడి, చందాలు పోగుచేయుట కయి యేర్పఱుపఁబడిన సభకు నేను కార్యదర్శిగా నియమింపఁబడితిని. కాగితముమీఁద నేనూఱు రూపాయలవఱకును చందాలుపడినను చాలినంత ధనము వచ్చు జాడ కానరానందున నప్పటి