పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/90

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

స్వీయ చరిత్రము.

రచితబ్రాహ్మవివాహమునం దున్నవి. చేసిన వాగ్దానప్రకారముగా నిర్ణయింపఁ బడినదినమున మాపాఠశాలామందిరమునం దష్టావధానమును మొదటసారి కంటెఁ గొంచెము హెచ్చుగాఁ జేసితిని. అప్పుడు చేసిన యవధానములివి - 1. కవిత్వము, 2. వ్యస్తాక్షరి, 3. నిషేధాక్షరి, 4. సమస్యాపూరణము, 5. చతురంగవినోదము, 6. చీట్లాట, 7. సంభాషణము, 8. పుష్పపరిగణనము. కవిత్వము పదిమందికి వారువారు కోరినపద్యములో కోరినవిషయమునుగూర్చి యొక్కొక్కయక్షరము చొప్పున విడిచినయక్షరమును మరల నడుగకుండఁ జెప్పితిని. ఆంధ్రగీర్వాణభాషలలో ముప్పదిరెండేసి యక్షరములకు మించని పద్యభాగమును శ్లోకమును విడికాగితములమీఁద వ్రాయించి, అక్షరములపైని వరుసయంకెలు వేయించి, కత్తరించిన ముక్కలను కలిపివేసి కవిత్వము చెప్పునప్పుడు నడుమనడుమ నేదో యొకముక్క నిచ్చుచు రాఁగా కడపట నన్నిటిని జేర్చి మనసులో వరుసగా కూర్చుకొని వా రిచ్చినవాక్యములను జదివి రెండు భాషలలో వ్యస్తాక్షరి చెప్పితిని. చరణమొకటికి రెండేసితావులలో వారు నిషేధించిన యక్షరములు విడుచుచు వచ్చి యొక్కొక్కయక్షరము చొప్పునఁ జెప్పి పద్యమును పూరించితిని. వారు సమస్యగా నిచ్చిన పద్య పాదమున కనుగుణముగా నర్థము వచ్చునట్లాలోచించి యష్టావధానమధ్యమున నొక్కొక్కచరణము చొప్పునఁ బద్యము చేసి సమాస్యాపూరణము గావించితిని. ఈనడుమనే యింకొకమిత్రునితో చతురంగ మాడు చుంటిని; నడుమ నడుమ బంటునో మంత్రినో గుఱ్ఱమునో యేనుఁగునో రాజునో శకటమునో త్రోయుచు నేదో యెత్తువేయుచుండుటతప్ప చతురంగక్రీడయందు నా కేదియు కష్ట మగపడలేదు. చీట్లాటయు నిట్టిదేగాని వచ్చినపట్లలోనిసంఖ్య లెక్క పెట్టుటలో నించుక కష్టమున్నది. నే నొక్కయాటలోను లెక్క తప్పఁబెట్ట లేదుగాని నాయెదుటిపక్షమువారు వినోదము చూచుసందడిలో లెక్క మఱచిపోవుచువచ్చిరి. మధ్యమధ్య జరిగిన సంభాషణములో నెదుటివా రడిగినప్రశ్నలకు నేను సదుత్తరము లిచ్చుచు వచ్చితిని. ఈపను లన్ని