పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/9

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

డఁగా నా స్వీయచరిత్ర భాగమును చదివినమిత్రులలో నొక్కరగు కే. వి. లక్ష్మణరావుగారు నా స్వీయచరిత్రమును తమ విజ్ఞానచంద్రికా గ్రంథమాలలో ప్రచురముచేసికొనుట కనుజ్ఞ యియ్యవలసినదని నన్నడిగిరి. ఆలాగుననే చేసికొనవచ్చు నని నేను నాసమ్మతిని దెలిపితిని. అంతట వారు వెంటనే తాము ప్రచురింపఁబోయెడు పుస్తకముల పట్టికలో నీపుస్తకమునుగూడ చేర్చి ప్రకటించిరి. అదిచూచి యిట్లేల త్వరపడి ప్రకటించితిరని నేను వారినడుగఁగా నిట్లుచేసి తొందర పెట్టినంగాని మీరు పుస్తకమును వ్రాయఁబూనరని యట్లు ప్రకటించితిమని వారు సమాధానముచెప్పిరి. అందుచేత నిప్పుడు ప్రకటింపఁ బడినదానిలో విశేషభాగమును కడచినవేసవికాలములో నేను బెంగుళూరిలో వ్రాయవలసినవాఁడనైతిని. కొంతవఱకువ్రాసి విడిచిన పుస్తకమును నాచేత మరల వ్రాయించుటకు కారకులయినందున వారియెడల నేనెంతయు కృతజ్ఞత గలవాఁడనయి యున్నాను. ఈగ్రంథమును నేను ప్రత్యేకముగా నాగ్రంథ సంపుటములలో నొకదానినిగా ప్రకటింపఁదలఁచియున్న వాఁడ నగుటచేత దీనిని పునర్ముద్రణము గావించుకొను స్వాతంత్ర్యమును విజ్ఞానచంద్రికా మండలివారి కియ్యక నా కే యుంచుకొన్నాఁడను. అందుచేత నీసారి తమ చందాదారుల కియ్యవలసిన పుస్తకముల నచ్చొత్తించుకొనెడి యీకూర్పునకుఁ దక్కవారికి వేఱుస్వాతంత్ర్య మేదియు లేదు. అయినను పూర్వ