పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/67

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రకరణము.

55

దేహము కలిగెను. ఆసమయమునం దాత్మూరి లక్ష్మీనరసింహముగారు బందరు నుండి మామండలపాఠశాలకు ద్వితీయోపాధ్యాయులుగా వచ్చిరి. వారు బ్రహ్మసమాజమతమునం దప్పు డభినివేశము గలవారు. అందుచేత వా రామత సిద్ధాంతములను విద్యార్థుల కప్పుడప్పుడు బోధించుచుండెడివారు. ఆయన ప్రోత్సాహమువలన మాలో మే ముపయుక్తము లయిన విషయములనుగూర్చి వారమునకొకసారి కూడి చర్చించుటయు విద్యార్థులలో నొక సమాజము నేర్పఱుచుకొంటిమి. నేనుగాక నామిత్రులగు కనపర్తి లక్ష్మయ్యగారును మఱి యిద్దఱు ముగ్గురునుమాత్ర మాసమాజమునకు వచ్చుచుండిరి. మే మయిదాఱుగురమును లక్ష్మీనరసింహముగారి యింటివద్దఁగాని మాయింటివద్దఁ గాని సమావేశమగుచుంటిమి. ఆకాలమునందు నలుగు రొకచోటఁ గూడి సభ చేయుటయే గొప్ప తప్పిదముగా నుండెను. మేము వీధిలోనుండి పోవునప్పుడు మమ్ము వ్రేలితోఁ జూపి "మీటింగువాళ్ళు వీళ్లేనర్రో" యని మూఢులు తమలోఁ దాము చెప్పుకొనుచు వచ్చిరి. అందుచేత మేము మాలోపల తలుపులు వేసికొని కూరుచుండియే సభ చేసికొనెడివారము. ఆయేడును సంవత్సరాంత పరీక్షలో నాకు పుస్తక బహుమానము వచ్చెను. నే నాసంవత్సరము సర్వకలాశాలాప్రవేశపరీక్షకుఁ బోయితినిగాని కృతార్థుఁడను గాలేదు.

1869 వ సంవత్సరమునందు నన్ను మరల రోగ మాశ్రయింప దగ్గును దౌర్బల్యమును హెచ్చయ్యెను. అందుచేత నేను చదువుటకుఁగాని పని చేయుటకుఁగాని యశక్తుఁడ నయి యుంటిని. నే నప్పుడు మంచ మెక్క లేదుగాని కొన్నిదినములు రోగపీడితుఁడనయి యింటనే యుండుచు దేహము కొంచెము స్వస్థపడినప్పుడు పద్యములు చెప్పుచు నుంటిని. చిన్నప్పటినుండియు నా యూహ లెప్పుడును శక్యాశక్య విచారము లేక యున్నతపదమునకయి పాఱుచుండెడివి. పురాణములను జదువునప్పుడం దభివర్ణింపఁబడిన మహర్షులవలె ఘోరతపస్సు చేసి తపోమహిమను బడయవలెనని వాంఛించుచుంటిని. కావ్యములను జదువునప్పుడు మహాకవినయి యుత్తమకావ్యములను రచియింపవలె