పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/41

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రకరణము.

29

కాఁబోలును! కాఁబట్టియే బాహ్యశత్రువులను వేవురనైనను నిరాయాసముగా జయింపవచ్చును గాని యొక్క యంతశ్శత్రువును నిర్జించుట యతిప్రయాసము మీఁదఁగాని శక్యము కాదని బుద్ధిమంతు లనేకులు చెప్పియున్నారు.

నీవు కార్యార్థినివిగాన మాటకు మాఱుమాటాడాక మౌనము వహించి కలహమును జంపి వేయవలసినదని యెవ్వ రెన్ని విధముల హితము చెప్పినను నాజనని హితులమాటలు చెవిని బెట్టక తన పట్టినపట్టును విడువక "కుటుంబద్రవ్యములో నర్ధభాగమునకు కర్తయయిన కొమారుఁడు నాకుండఁగా నొరులచేత రోఁతమాటలు పడుచు వారికి దోసిలియొగ్గి దైన్యము వహించి యస్వతంత్రజీవనము చేయవలసినగతి నా కేమిపట్టినది?" అని వీరాలాపములు పలుకుచు ఖడ్గవాదిని యయి పోరాటమునకు వెనుకంజ వేయకుండెను. ఆహా ! మూర్ఖతాపిశాచావేశ పరవశలయి యుండువారికి వివేకముండదుగదా? ఇట్లు కొంతకాలమువఱకు నా పెదతండ్రిగారు తమయుద్యోగకార్య నిర్వహణానంతరము సాయంకాల మింటికి రాఁగానే యాయన చెవిని బడునని తఱచుగా మన స్తాపకరములైన గృహ కలహవార్తలు తప్ప మఱి యేవియు లేకుండెను. ఆయన కారణములేని యీశుష్కకలహములను వారించుటకయి నయమున భయమున సర్వవిధములఁ బ్రయత్నముచేసి చూచెనుగాని దేనివలనను కార్యము లేక పోయెను. భార్యపైని కోపపడిన భార్యకు కోపము; మఱదలిపైని కోపపడిన మఱదలికి కోపము. ఈయుభయకోపములకు నడుమ నాయనకు మనస్తాపము. ఇటువంటి విషమసంధిలో కార్యనిర్వాకులైన గృహయజమానులకుఁ గలుగు మనో వైకల్య మింతయంతయని చెప్ప శక్యము కాదు. తగవులాడెడి యిరువురును తమదే న్యాయపక్షమనియు తప్పిదమంతయు నెదుటివారిదే యనియు భావింతురు. అందుచేత వారెవ్వ రెంతచెప్పినను వినక పురుషు డింట నున్నంతవఱకును లో లోపల రాఁజుచున్న క్రోధాగ్నిని పైకి వెడలనీయక మ్రింగి పునః కలహకరణోపాయము నాలోచించుచు నిశ్శబ్దముగా నున్నను, పురుషుఁడిల్లు వెడలఁగానే వెడలఁ గ్రక్కి యేదో కారణాభాసమును కల్పించుకొని వెనుకటి కల