పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/391

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

378

స్వీయ చరిత్రము.



డినను ప్రకటితములగు లెక్కలలో నిండు మొత్తములను, గుప్తములగు లెక్కలలో నిజమైన మొత్తములను, వేసికొని, వచ్చినసొమ్ములో కార్యనిర్వాహకుని భాగముపోఁగా మిగిలిన దాని నుపాధ్యాయులు వంతులవరుసను బంచుకొనుచుండిరి; ఉపాధ్యాయులకు ముట్టెడు మాస వేతనము లెనిమిదులును పదులును పదునైదులును మాత్రమే యయినను, ఇరువదులును ముప్పదులును నలువదులును ఏఁబదులునునైనట్టు లెక్కలలోచూపఁబడి వారివలన నాపెద్ద మొత్తములకాదానికలు గైకొనఁబడుచుండెను; ఈపెద్ద పెద్దజీతముల నిచ్చుటకయి కార్యనిర్వాహకులు తమచేతి సొమ్మును వ్యయపెట్టుచున్నట్టు చూపి దొరతనమువారివలన సహాయ ద్రవ్యముగా విశేషవిత్తము గైకొనఁబడుచుండెను. ఇట్టి యనుచిత కార్యములచేత నుపాధ్యాయులే నీతిమాలిన వారయినప్పుడు వారి శిష్యులైన విద్యార్థు లేమి నీతిమంతులగుదురు? ఇట్టికుతంత్ర ప్రయోగమువలన నీతనిమాత్రమే కాక విద్యను సహితము విద్యార్థులు కోలుపోవుచుండిరి. ఇవియన్నియు సర్వజన విదితములైన బహిరంగ రహస్యములేయైనను వానిని స్థాపించుటమాత్రము దుర్ఘటము. ఈవిధమున విద్యకును నీతికిని నీళ్లు విడుచుచున్న విద్యార్థుల కంటె-వారి సంరక్షకులలో నధిక సంఖ్యాకు లెక్కువవికేలు కాకుండిరి. వారు తమ బాలురను క్రమ శిక్షగల పాఠశాలలకుఁ బంపక యెక్కడతక్కువ జీతములు చేకొనఁబడునో యెక్కడ బాలురెక్కువ తరగతులలో చేర్చుకొనఁబడుదురో యక్కడికే తమ సంరక్ష్యులను బంపుచుండిరి. అందుచేత నప్పుడు మాపట్టణములోని విద్యయొక్కయు విద్యార్థులయొక్కయు స్థితి దుస్థితికి వచ్చి శోచనీయమైనదిగానుండెను. కాఁబట్టి విద్యాభివృద్ధిని గోరువారికిని దేశాభిమానముగలవారికిని బాలుర నీతిపరులఁగావింప కాంక్షించువారికిని విద్య మానదుస్థితిని తొలఁగించి సుస్థితిని నెలకొల్పఁబూనుట యనివార్య ధర్మమయియుండెను. అప్పటి విద్యావిషయకవిధు, లిప్పటివలె కఠినములుగాక యవ్యవస్థితములై యుండినందున విగత ధార్మిక విద్యాలయములను లయము నొందించుట ఋజుమార్గవర్తనులకు శక్యముకాకుండెను. అందుచేత పాఠశాలా కార్యనిర్వాహక సంఘమున కధ్యక్షులయిన మెట్కాపు దొరగారును సంఘ