పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/390

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

377



జరిగెడు సభలలో నేను తఱుచుగా ధర్మోపన్యాసములు చేయుచుండెడివాఁడను. 1881-90 సంవత్సరములకు నడుమను పయినిజెప్పిన పుస్తకములనుగాక చమత్కార రత్నావళి, రాగమంజరి నాటకముల నింగ్లీషునుండియు రత్నావళీ మాళవికాగ్ని మిత్రనాటకములను సంస్కృతమునుండియు తెలిఁగించి, ప్రహ్లాదనాటకము దక్షిణగోగ్రహణము, సత్య హరిశ్చంద్రనాటకము అను రూపకములను, కొన్ని నాటక కథలను, ప్రహసనములను, ఆంధ్రకవుల చరిత్రమును రచించితిని. ఇవిగాక వితంతువివాహవిషయమునను, ఇతర విషయమునను, పెక్కుపన్యాసములు వ్రాసి ప్రచురించితిని; పూర్వకవిప్రణీత గ్రంథములను కొన్నిటిని సంస్కరించి ప్రకటించితిని.

ఆకాలమునందు మాపట్టణములో బాలురవిద్య యత్యధమస్థితియందుండెను. సునిర్మితములయిన సభలయొక్క పాలనముక్రిందనుండి చక్కగా నడపఁబడుచుండిన రెండు పాఠశాలలకును పోటీగా ధనార్జనాభిలాషచేతను కీర్తికామిత్వముచేతను కొందఱు బుద్ధిమంతులు నీతిమతధర్మబోధన మొనర్చెదమనియు సద్విద్య గఱ పెదమనియు సులభ జ్ఞానదానముచే బీదల కుపకారముచేసెద మనియు పలుమిషలుపెట్టి యాస్తికపాఠశాలయనియు మహారాష్ట్రపాఠశాల యనియు స్వదేశాభిమానిపాఠశాల యనియు పెద్ద పెద్ద పేరులు పెట్టి క్రొత్త క్రొత్త పాఠశాలలను పెట్ట మొదలు పెట్టిరి. ఇట్టి పాఠశాలలకెల్ల మొట్టమొదట దారి చూపినది నేతిబీరకాయవలె సార్థకనామము వహించిన యాస్తికపాఠశాల. ఈనూతన పాఠశాలలపోషణమునకయి నిధిలేదు, చందాలులేవు, దాన ధనములేదు. ఉపాధ్యాయులజీతములకు విద్యార్థు లిచ్చెడు నెలజీతములే యాధారము. ఇతర సుస్థిరపాఠశాలలనుండి విద్యార్థులను సాధ్యమైనంత యెక్కువమందిని తమపాఠశాలకా కర్షించుటకయి పన్నిన యుపాయములు విద్యార్థుల వలన తక్కువజీతములను గ్రహించుట, తోడి బాలుర నెక్కువమందిని తెచ్చిన వారివలన జీతములు గైకొనకుండుట, బాలురను తగనితరగతులలోచేర్చుకొనుట మొదలైనవి. బాలురవలన గ్రహించెడివి క్రమముగాఁ గైకొనవలసిన వానిలో నర్థాంశమును చతుర్థాంశమును అష్టమాంశమును షోడాశాంశమును మాత్రమేయుం