పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/282

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

268

స్వీయ చరిత్రము.

"ఎవ్వరికిని భారముగానుండని యీ యుత్తమకార్యమునకు మీరు తోడుపడెడు పక్షమున, ఇంతవఱకును కాయ కష్టపడి శ్రీ పైడా రామకృష్ణయ్యగారి ధనముతో చేసినపనినే నేఁటినుండి మీధనముతో చేసి చేతనయినంత కృషిచేసి మీధనము సార్థకపడునట్లు సాధ్యమయినన్ని వివాహములను జేయింపఁ బ్రయత్నించెదను."

అని వాగ్దానము చేసితిని. తరువాత బండ్లు చేసికొనిపోయి చందాల నిమిత్తము గొప్పవారి గృహములకు తిరుగ నారంభించితిని. శ్రీపిఠాపురపురాజుగారి దత్తపుత్రు లిన్నూఱు రూపాయలిచ్చిరి. చెంచలరావు పంతులుగారును రఘునాథరావుగారును చెఱి నూఱేసి రూపాయలును చందాలు వేసిరిగాని తరువాత వారియ్య ననుగ్రహింపలేదు. సాంబయ్యసెట్టిగారును, రాజరత్నము మొదలియారుగారును, రంగయ్యసెట్టిగారును, నంబెరుమాళ్ల సెట్టిగారును, ఒకరొకరు ఇరువదియైదేసి రూపాయలు చందాలువేసిరి. ఇరువది, పదినేను, పది రూపాయలు ముగ్గురిచ్చిరి. బండి చేసికొని యొక గొప్ప గృహస్థినియింటికి చందా నిమిత్తము పోయితిని. మహాధనికుఁడై వితంతువివాహములయం దత్యంతాదరము చూపుచు నేను పోయినప్పు డెల్ల ప్రత్యు స్థానముచేసి నన్నధిక గౌరవముతోఁ జూచుచుండెడి యాగృహస్థుఁడు చందా నిమిత్తము నేను పోయిన యాదినమునందు నాపేరుగలచీటి లోపలికిపోయిన యరగంటసేపునకు వెలుపలికివచ్చి తాను తొందర పనిమీఁద నున్నట్లు నిలుచుండియే రెండుమాటలుచెప్పి మరల లోపలికిఁబోయెను. ఆయనకు నిజముగా తొందరపనియే యుండి యుండవచ్చును గాని నేను మాత్ర మది గొప్ప యవమానముగా భావించుకొని కోపముతో వెనుక మరలితిని. బాల్యము నుండియు నాది శీఘ్ర కోపోద్రేకమునొందెడు స్వభావము. కార్యార్థమయి యొరుల వేఁడు వారికుండవలసిన యోర్పుగాని వారి ననుసరించి తిరుగవలసిన యడఁకువగాని నాయొద్దలేదు. మొదటినుండియు నేను శాసించుటకేకాని యాచించుట కలవాటుపడిన వాఁడనుగాను. ఏహేతువుచేతనోకాని యీ