పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/254

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

240

స్వీయ చరిత్రము.



వలసినవాఁడనయితిని. రెండవనాఁడు మరల చూడఁబోయినప్పుడు వారి భటులు, రాయలవారు జపములో నున్నారనియు చూచుటకు సమయము కాదనియు నన్ను లోపలికిపోకుండ వారించినందున నాఁడును వచ్చినదారినే మరల మాయింటికిఁబోయితిని. ఇట్లు రెండు దినములు వృధాకాలహరణ మయ్యెను. మూఁడవనాటి ప్రాతఃకాలమున ననఁగా 7 వ తేదిని నేనెప్పటియట్లు వారి దర్శనార్థమరుగఁగా కావలిభటులు వెనుకటి సాకులనే చెప్పిరికాని యీసారి తప్పక చూచి మాటాడి మఱిరావలెనని నిశ్చయించుకొని వచ్చితిని గనుక వారి మాటలను గణనచేయక తిన్నగా లోపలికిపోయి మేడయెక్కి వారు కూరుచుండు స్థలముచేరితిని. వారు నన్ను చూచి తమ పీఠమునుండిలేచి యెదురుగావచ్చి నన్నుఁగొనిపోయి యుచితాసనమునందుఁ గూరుచుండఁబెట్టి నా క్షేమము విచారించి గౌరవించిరి. వారు నారాకను తాము వింటిమనియు తొందరపనులచేత మూడు దినములనుండియు నన్ను చూడలేక పోయినందుకు చింతిల్లుచుంటిమనియు నుపచారవాక్యములు పలికి క్షమార్పణముచేసిరి. నే నామాటలయందు దృష్టియుంచక వచ్చిన కార్యవిషయమునందుకొని రేపటి దినము వివాహముజరపుటకు నేను నిశ్చయించుకొంటిననియు ఆహ్వానపత్రికలను వారిపేరఁబంపుట కిష్టపడనియెడల నాపేరనే పంపెదననియు, స్పష్టముగాఁ జెప్పితిని. వారించుక సేపాలోచించి కాకితమును కలమును గైకొని యాహ్వానపత్రికను వ్రాసి క్రింద తమ చేవ్రాలుచేసి నాకుచూపి నేనుండఁగానే దానిని ముద్రింపించుటకయి పొరుగున నున్న తమ ముద్రాయంత్రమునకుఁ బంపిరి. పోయినపని యగుటచేత నేనువారిని వీడ్కొని యింటికి వచ్చితిని. చెంచలరావు పంతులుగారు మాయింటికి మైలుదూరములోనుండినను ప్రతిదినమును మాయింటికివచ్చి నాతో మాటాడిపోవుచునే వచ్చిరి. రఘనాథరావుగారు ముద్రింపఁబడిన యాహ్వానపత్రికలను గొన్నిటిని నాయొద్దకుఁబంపిరి. వానిని చూడఁగా క్రింద వారిపేరు కానఁబడలేదు ; ఆపత్రిక వివాహమునకు విజయం చేయుటకు సమాజమువారిచే నెల్లవారును గోరఁబడుచున్నారని పేరులేకుండఁ