పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/23

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి ప్రకరణము.

11

వేసిరి; పిమ్మట దొడ్డిలో పడమటివైపుది కొంతభాగ మమ్మివేసిరి; అటుపైని వెండిబంగారపువస్తువులను విక్రయముచేయసాఁగిరి. ధనదేవత పలాయన మయిన తరువాత దానిని విడిచి గర్వ మొంటిగా చిరకాలము నిలిచియుండనేరదు. గర్వము తమ్ము విడిచి తొలఁగఁగానే తాము దురభిమానమును విడిచి మా తండ్రు లుద్యోగములనిమిత్తము కృషిచేయ నారంభించిరి. అన్న దమ్ము లిరువురును సంస్కృతమునఁ బంచకావ్యములను ముగించిరి; తెలుఁగునందు మంచి సాహిత్యము కలవారయి యొకవిషయమునుగూర్చి చక్కఁగా వ్రాయుటకును చిక్కువ్రాఁత నైన ననర్గళముగాఁ జదువుటకును సమర్థులయి యుండిరి; ఇంగ్లీషుభాషయందును గొంతజ్ఞానము కలవారయి చదువుటకును వ్రాయుటకును మాటాడుటకును నేర్చియుండిరి. వా రుభయులలో మా పెదతండ్రి గారు కోపస్వభావము గలవారు; మా తండ్రిగారు శాంతస్వభావము గలవారు. మొట్టమొదట మాతండ్రిగారికి కాకినాడలోని మండలకరగ్రాహికార్యస్థానము నందు పిఠాపురసంస్థానసంబంధమున స్థిరమైన లేఖకోద్యోగము దొరకినది. మాపెదతండ్రిగారి కప్పుడప్పుడు పత్రికావహన కార్యస్థానమునందును యంత్ర కారశాఖయందును నల్పకాలికము లయినపను లగుచుండెను.

చిన్న తనములోనే మాతండ్రిగారికి మేనత్తకొమారిత నిచ్చి వివాహము చేసిరి. మాతాతగారిచెల్లెలు స్త్రీ శిశువును గని కాలము చేసినందున, పున్నమ్మ యనెడి యాచిన్న దానిని ముత్తవ యగు నక్కమ్మగారును మేనమామ యగు మాతాతగారును పెంచి పెద్దదానినిఁ జేసిరి. ఈడు తగ దనియు నెదురు మేనఱిక కూడదనియు కొందఱు కొన్ని యాక్షేపణలు చేసినను పాటింపక పెంచినప్రేమచేత విడిచి యుండలేకయు జననియొక్క యాజ్ఞను ద్రోసివేయ లేకయు వయస్సునం దొక్కయేఁడుమాత్రమే చిన్నఁదయినను మాతాతగా రాచిన్న దానిని తమద్వితీయపుత్రుఁ డయిన మాతండ్రిగారికే యిచ్చి పెండ్లి చేసిరి.