పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/15

ఈ పుట ఆమోదించబడ్డది

4

స్వీయ చరిత్రము.

కాకుండెను. భోజనము పెట్టినచోఁ దాను వంట చేసిపెట్టెద నని పడవలోని బ్రాహ్మణుఁ డొకఁడు నాతోఁ జెప్పెను. నే నాబ్రాహ్మణుని వెంటఁబెట్టుకొని నిప్పులు గురియుచున్న యాయెండలో పావుక్రోసుదూరములోనున్న యా యూరికి నడచి కరణముయొక్క యిల్లుచేరితిని. ఆయూరిపే రిప్పుడు నాకు జ్ఞప్తికి రాలేదు. ఆయూర నొక్కకరణముయొక్క యిల్లుదక్క వేఱు బ్రాహ్మణగృహము లేదఁట. ఆ యెండలో నెట్లో యాగృహమునకు దేహములు చేరవైచి, రామాయణ పారాయణము చేయుచున్న గృహపతిని జూచి భోజనార్థమై వచ్చితిమని చెప్పితిమి. వారియింట నింకను భోజనములు కాక పోయినను తాము డబ్బు పుచ్చుకొని యన్నముపెట్టువారము కామనియు, ఊరక పెట్టుటకు వలనుపడ దనియు, ధనముగైకొని భోజనము పెట్టు పూటకూటియిల్లు తమగ్రామమున లేదనియు, చెప్పి శీఘ్రముగా నింకొకయూరికిఁ బొండని మాకాయన హితోపదేశము చేసెను. కోమటియింటికిఁ బోయి బియ్యము మొదలయినవి కొనితెచ్చుకొనెద మనియు, కొంచెము తావుచూపి పాకముచేసికొనుటకు పాత్రసామగ్రియైన నియ్యవలసినదనియు, మేమాగృహస్థుని వేఁడుకొంటిమి. అతఁడు వలసినచో మృణ్మయపాత్రములను దెచ్చుకొని యొకపంచను వంట చేసికొనవచ్చునని యనుజ్ఞ యిచ్చెను. అప్పుడేమి చేయుటకును తోఁచక యాలోచించుచున్న నన్నుఁ జూచి, కుండలములు వేసికొని యొకపీటమీఁదఁ గూరుచుండి వాల్మీకిరామాయణమున కర్థము చెప్పుచున్న యొకవృద్ధబ్రాహ్మణుఁడు "మీయింటిపే రేమి?" అని యడిగెను. "కందుకూరివారు" అని నేను బదులు చెప్పితిని. "మీపేరెవరు?" అని యాయన మరల ప్రశ్న వేసెను. నాపేరు చెప్పితిని. అప్పు డాయన మాతాతగారిపేరు చెప్పి "మీకాయన బంధువులా?" అని యడిగెను. "ఆయన మా తాతగారే" యని చుట్టఱికమును దెలిపితిని. ఆమాట వినఁగానే యాయన పీటమీఁదనుండి లేచి నాకు పీట వేసి, యంతవఱకును నిలువఁబడియున్న నన్నుఁ గూర్చుండ వేఁడికొని, గౌరవముచూపి, మాతాతగారిని బహువిధముల