పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/117

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

స్వీయ చరిత్రము.

కాకాలపున్యాయవాదులలో ననేకు లలవాటుపడిన వారేయయినను, ఈయపూర్వ న్యాయాధికారియొక్క వ్యవహారనిర్ణయప్రకారము వారికి సహితము దుర్భరమయ్యెను. ఇప్పుడు న్యాయాధిపతియే బోసినోటిపులి యయి సర్వమును దానే గుటుక్కున మ్రింగువాఁడయినందున, అధికారుల పేరులు చెప్పి యెక్కువ పుచ్చుకొని తక్కువ యిచ్చు చుండువారికి వీసమో పరకోగాని హెచ్చుమిగుల కుండెను. మామునసబుగారు గొప్పగొప్ప మొత్తములను స్వీకరింప వలెనన్న యత్యాశచేత వరుస తప్పించి పెద్దమొత్తములుగల వ్యాజ్యములను ముందుగా విమర్శించి తీర్ప నారంభించిరి; అంతేకాకతామున్న యల్పకాలములోనే విశేష పొత్తము సంపాదింపవలెనన్న దురాశచేత నేకకాలమునందే రెండుమూఁడు వ్యాజ్యములలో సాక్షులవిచారణ చేయుచు, తామొక్కవ్యవహారములో సాక్షులవిమర్శచేయుచు నింకొకవ్యవహారములో సాక్షులవిమర్శ చేయుటకు గుమాస్తాల కప్పగించుచుండిరి; ఒక్క సారిగా నన్ని వ్యాజ్యముల గ్రంథమును సాక్షివాగ్మూలములను ప్రతిదినమును జదివి తీర్పులు వ్రాయుట యొక్కరికి దుర్భరముగానఁ దాము కొన్ని వ్యాజ్యముల గ్రంథమును జదివి స్వయముగా తీర్పులు వ్రాయుచు, మఱికొన్నిటిని తమచుట్టమైన చిత్రపు కామరాజుగారి కప్పగించి యాయనచేత చిత్తితీర్పులు వ్రాయించి తాము వానికి శుద్ధప్రతులను వ్రాసికొనుచు యథేచ్ఛముగా విహరింపఁ జొచ్చిరి. ఇట్లాతఁడు విచ్చలవిడిగా లంచములు పుచ్చుకొని ప్రజలను దోఁచి యన్యాయము చేయుచుండినను, పయియధికారియైన మామండలన్యాయాధిపతిగా రాయన కేవల న్యాయమూర్తియనియే భావించుచుండిరి. న్యాయవాది పట్టాలసత్రమును వేసిన వాలేసుదొరగారే మాకప్పుడు మండలన్యాయాధిపతిగా నుండిరి.

అప్పు డీయధికారియొక్కదుర్న యము నేలాగుననయినఁదుదముట్టింప వలెనని నిస్ఛయించుకొని మావివేకవర్ధని ధర్మస్థాపనదీక్షవహించి కార్యసిద్ధి కయి సాక్ష్యాన్వేషణ ప్రయత్నములో నుండెను. ఇంతలో బాధ నొందిన ప్రజలును వారిపక్షమునఁ బనిచేయున్యాయవాదులు కొందఱును ప్రాడ్వివాక