పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/113

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

స్వీయ చరిత్రము.

తమపెట్టెలోనుండి వివేకవర్ధనీపత్రికను దీసి నాచేతి కిచ్చి, న్యాయవాది పట్టాలనుగూర్చిన వ్యాసమును జూపి, "ఇది మీరే వ్రాసితిరా ?" అని యడిగెను. ఉన్నతన్యాయసభవారిముద్రతో నున్న యాపత్రికను జూడఁగానే యందలితత్త్వమంతయు నా కవగత మయ్యెను. న్యాయసభాభవనమంతయు వేడుక చూడవచ్చిన పౌరులతోను క్రొత్తపట్టాల నొందిన న్యాయవాదులతోను నిండియుండెను. వెంటనే కర్తవ్యము నాలోచించి లేచి నేను "మీ ప్రశ్న కుత్తరము చెప్పుటకు ముందు నా కీయాజ్ఞాపత్రిక యేరాజశాసనాను సారముగాఁ బంపఁబడినదో యెఱుఁగ వేఁడెదను" అని బదులు చెప్పితిని. న్యాయాధిపతి యేమియు తోఁచనివానివలె నించుక యాలోచించి తా నడిగినప్రశ్నమును నే నిచ్చినయుత్తరమును కాగితముమీఁద వ్రాసి, "ఈపత్రికను మీరే ప్రకటించెదరా?" అని మఱియొకప్రశ్న వేసెను. "నేనడిగినదాని కుత్తరము చెప్పరైతిరి. మీప్రశ్నల కుత్తరములు చెప్పుటకుఁ బూర్వము నేను బదులు చెప్పుటకు బద్ధుఁడనో కానో తెలియఁగోరెదను." అని నేను మరలఁ బలికితిని. "మే మడిగినదాని కుత్తరము చెప్పుట మీకిష్టములేదు కాఁబోలును" అని దొరవారు నవ్వుచుఁ బలికిరి. "నేనుత్తరము చెప్పుటకు బద్ధుఁడనైనపక్షమునఁ జెప్పుట కిష్టమున్నది." అని నేనంటిని. "ఈదశలో మీరు బద్ధులైయున్నారని మేము చెప్పఁజాలము. మీకిష్టమున్నచోఁ జెప్పవచ్చును." అని న్యాయాధిపతిగా రనిరి. "నేను బద్ధుఁడను గానిపక్షమున బదులు చెప్పుటకు నాకిష్టము లేదు." అని నేను తెలియఁబలికితిని. ఈప్రశ్నోత్తరముల నన్నిటిని వ్రాసికొని "ఇఁక మిమ్మట్టేయుంచుట నాకిష్టము లేదు." అని దొరవారనిరి. "సంతోషము" అని చెప్పి నే నీవలికి వెడలివచ్చితిని. ఈకథ యంతయు నైదునిమిషములలో ముగిసినది. రామకృష్ణారావుగారు లోపలికిఁ బోయి "న్యాయాధిపతి తెలివితక్కువవాఁడు గనుక సరిపోయినదిగాని యిటు వంటియవినయోక్తులు పలికినందున కింకొకఁడైన సభాతిరస్కారముక్రింద దండించి యుండఁడా?" అని తనక్రిందియుద్యోగస్థులవద్ద కేకలువేసెను. నా