భాషాధ్యాపకుడుగా పనిచేసేవాడు.
సాంఘిక సేవారంగ ప్రవేశం చేసి, విద్యావకాశాల మెరుగుదలకు విస్తృతంగా పనిచేశారు. రాజకీయ నాయకుడుగా, పాత్రికేయుడుగా బహుముఖంగా దేశానికి సేవచేసే భాగ్యం ఆయనకు కల్గింది. తిలక్ ముప్పదిమూడేళ్ళ ప్రజాహిత సేవారంగంలో ఎనిమిదేళ్ళు కారాగారంలో గడిపాడు. 1908లో కేసరి పత్రికలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వ్యాసం వ్రాశాడన్న కారణంతో 52 ఏళ్ళ బాలగంగాధర తిలక్ గారికి ఆరేళ్ళు దీర్ఘకాల శిక్ష విధించింది నాటి ప్రభుత్వం.
మహ్మద్ ఆలీ జిన్నా, తిలక్ ను హామీపై విడిపింపవలసినదిగా, న్యాయమూర్తి దాపర్ కు అర్జీ పంపుకున్నాడు. ఒకప్పుడు తిలక్ ను ప్రభుత్వం నిర్బంధించినపుడు తిలక్ పరంగా వాదించిన, దాపర్ మహాశయుడు, న్యాయమూర్తి పదవిని చేపట్టిన తర్వాత బ్రిటిష్ వారి తొత్తుగా మారి జిన్నా చేసిన విజ్ఞప్తిని తిరస్కరించాడు. తిలక్ పై దేశద్రోహ నేరమారోపించింది ప్రభుత్వం. తిలక్ న్యాయస్థానంలో తన నిర్దోషిత్వమును రుజువు చేసికొనుటకు తన వాదమును నిరూపించిన తీరు అతని న్యాయశాస్త్ర ప్రతిభకు అద్దం పట్టింది. ఆయన వాదనను వినుటకు ప్రతిదినం ప్రజలు కోర్టు ఆవరణలో మూగేవారు. రాత్రి 9 గంటల వరకు విచారణ సాగించిన దాపర్, లోకమాన్యుని ఉద్దేశించి "నేను శిక్ష విధించుటకు ముందు నీవేమైనా చెప్పదలచుకొన్నచో చెప్పవచ్చు" అన్నాడు. తిలక్ ధీర గంభీర వదనంతో, "అయ్యా తాము నన్ను దోషిగా తీర్మానించవచ్చు. కానీ నేను ముమ్మాటికీ నిర్దోషిని. ఇది నా దృఢవిశ్వాసం. నేను స్వేఛ్చగా వున్నప్పటికంటే జైలు శిక్ష అనుభవించుటవల్లనే నా ఉద్యమం మరింత విజయవంతం కాగలదు. అదే దైవనిర్ణయమైతే అలాగే కాని" అన్నాడు. న్యాయాధిపతి తిలక్ కు వేయి రూపాయల జరిమానా, ఆరేళ్ళ ద్వీపాంతరవాస శిక్ష విధించాడు. దేశం ఆ తీర్పు విని ఆగ్రహించింది. కాని దాస్యంతో మ్రగ్గుతున్న వారపుడేమి చేయగలరు?
మాండలే జైలులో వున్నపుడే తిలక్ భగవద్గీతపై గొప్ప వ్యాఖ్యానం వ్రాశాడు. అదే 'గీతా రహస్యం'. కర్మ చేయటమే మన ప్రధాన ధర్మమన్నారు. ఆ వ్యాఖ్యతో ఆ గ్రంథం ప్రపంచ విజ్ఞుల మన్ననలందుకొన్నది.
1914 జూన్ 8వ తేదీన మాండలే జైలు నుండి తిలక్ ను తీసుకొనివచ్చి అర్ధరాత్రివేళ పూనాలోని వారి ఇంటిలో దిగబెట్టింది ప్రభుత్వం. తెల్లవారేసరికి, తిలక్ విడుదల వార్త దేశమంతటా వ్యాపించింది. ప్రజల ఆనందానికి అవధులు లేకపోయాయి.
1916 జూలై 23వ తేదీన లోకమాన్యుని షష్టిపూర్తి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయి. ఆ సందర్భంగా మాట్లాడుతూ "నా వంటి సామాన్యుని సేవతో మీరు తృప్తిపడరాదు.... మీరు భేదాలను మరచి జాతీయ వీరసోదరులుగా ఉద్యమించాలి. ఇచట అహంకారానికి, భయానికి తావుండదు. మన తరములో కాకున్నా మన తరువాత తరము వారికైనా విజయం నిశ్చయం" అన్నాడు.