పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/84

ఈ పుట ఆమోదించబడ్డది

సర్ థామస్ మన్రో ఈస్టిండియా కంపెనీ వారి మద్రాసు సైన్యంలో ఒక సైనికుడు. కుటుంబ పరిస్థితుల వల్ల ఉన్నత విద్య పూర్తి చేయలేక, కంపెనీ కొలువులో చేరాడు. జీతం తక్కువైనా సర్దుకొనేవాడు. ఎర్స్ కీన్ అనే మిత్రునికి వ్రాసిన జాబులో యిలా అన్నాడు.

భారతదేశానికి వచ్చేదాక నాకు, ఆకలి దప్పులు, అలసట, బీదరికం అంటే ఏమిటో తెలియదు. ఇక్కడ మొదటి రెండూ నాకు అప్పుడపుడు అనుభవంలోకి వస్తుండగా మూడవది మాత్రం నన్ను వెంటాడుతూ వుండేది.

మొదతి మూడు సంవత్సరాల కాలంలో రాత్రిపూట తన పుస్తకాలను తలగడగాను, నాలుగు కర్రలపై పరచిన కాన్వాస్ గుడ్ద పరుపుగాను, వేసుకొనే కోటు దుప్పటిగాను ఉపయోగించినట్లు, మిత్రునికి 23-7-1789లో వ్రాసిన జాబులో పేర్కొన్నాడు. పదేళ్ళ పాటు సైనికుడుగా మంచిపేరు సంపాదించాడు. రెవిన్యూ విధానాన్ని రూపొందిచుటలో శిక్షణ పొందాడు. 18వ శతాబ్ది చివర ల్యాండ్ సెటిల్‌మెంట్ నిర్వహణకు దక్షిణ కన్నడ ప్రాంతానికి పంపబడినాడు.

మన్రో నిజాయితీపరుడు. ప్రజల నుండి, రైతుల నుండి ఎట్టి కానుకలు స్వీకరించే వాడు కాదు. మన్రోకు స్వాగతమివ్వటానికి ఒక గ్రామాధికారి తన గ్రామంలో పెద్ద పందిరి వేయించాడు. అందుకు కూలీలకు పైసా ఇవ్వలేదని తెలుసుకున్న మన్రో, పందిరి వద్దకైనా వెళ్ళక, చెట్టునీడన చిన్న డేరాలో మకాం చేశాడు. రైతుల నుండి పాలు, పళ్ళు కూడా ఉచితంగా తీసుకొనే వాడు కాదు. తన క్రింది అధికారులను కూడా అలాగే వుండనిచ్చేవాడు.

రైతుల నుండి ఎక్కువ శిస్తులు వసూలు చేయటం న్యాయం కాదన్నాడు. భూసంబంధమైన చట్టాల ముందు, బీదలు, ధనికులు అన్న తేడా వుండరాదన్నాడు. ఎవరైనా సరే తనకున్న భూమినంతటినీ తనకున్న వనరులతో సాగు చేసుకోవచ్చు నన్నాడు. అంత వరకు గ్రామ ప్రాంతాలలో భూముల మీద వున్న అగ్రవర్ణాల వారి పెత్తనంపై చావు దెబ్బతీశాడు. భూమి ప్రభుత్వ ఆస్తి, నిర్ణీత శిస్తుపై రైతులకు కౌలుకు యివ్వాలని ఆదేశించాడు. రాయలసీమ ప్రాంతంలో తానున్న ఏడేళ్ళకాలంలో మన్రో 2,06,819 పట్టాలను రైతులకు అందజేశాడు. రైతులకు భూమిపై సర్వహక్కులు వుంటాయని ప్రకటించాడు. ఇందువల్ల భూమిసాగు గణనీయంగా పెరిగింది. ప్రభుత్వాదాయం పెరిగింది.

ఉదారమైన భూమిశిస్తును ప్రకటించడం మన్రో గొప్పదనానికి నిదర్శనం. రైతు తన ఫలసాయం నుండి 2/3 వంతు మిగుల్చుకొన్నపుడే భూమి విలువైన ఆస్తి కాగలదన్నాడు మన్రో. 1807 లో అన్నిరకాల భూముల మీద 25 శాతం పన్ను తగ్గించాడు. రైతులు తవ్వుకొన్న బావులు, చెరువుల మీద అదనంగా 8 1/3 శాతం పన్ను తగ్గింపుకు సిఫారసు చేశాడు. ఈ విధానాన్ని 1820లో మద్రాసు గవర్నర్ గా చేరిన తర్వాత అమలు చేశాడు.