పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/83

ఈ పుట ఆమోదించబడ్డది

చిరస్మరణీయుడు

సర్ థామస్ మన్రో
(1761-1827)

"ప్రజల పట్ల నిజాయితీతో కూడిన సానుభూతిగల సునిశిత మేధావి" అని కార్ల్ మార్క్స్ చే ప్రశంసలందుకొన్న పరిపాలకుడు సర్ థామస్ మన్రో.

వ్యాపారులుగా వచ్చి మన దేశంలో స్థిరపడి దేశాన్ని దోచుకున్నారు ఆంగ్లేయులు. వారిలో అధిక సంఖ్యాకులు అవినీతిపరులు, అక్రమార్జనాపరులు, అహంకారులు. ప్రజల పట్ల ఏ మాత్రం అభిమానం లేనివారు.

కారుచీకట్లలో వెలుగురేఖలవలె కొందరు నిజంగా మన దేశాన్ని ప్రజలను ప్రేమించారు. మన సంస్కృతి పట్ల గౌరవంతో వ్యవహరించారు.

ప్రధానంగా తెలుగు ప్రజలు మరువరాని తెల్లదొరలలో అగ్రగణ్యుడు సర్ థామస్ మన్రో. రాయలసీమ వాసులకు ఆపద్భాంధవుడు మన్రో.

రాయలసీమ తరతరాలుగా అనావృష్టికి గురియైన ప్రాంతం. ప్రకృతి వైపరీత్యానికి తోడుగా, పిండారీల దోపిడులు, పాళెగాండ్ర దురాగతాలు సీమ ప్రజలను నానా యాతనలకు గురిచేసేవి. అశాంతితో పరితపిస్తున్న ప్రజానీకాన్ని ఆదుకొని, సీమలో శాంతిభద్రతలను నెలకొల్పిన మహనీయుడు మన్రో.

1792లో జరిగిన శ్రీరంగపట్నం సంధి ప్రకారం కడప, అనంతపురం, కర్నూలు, బళ్ళారి నిజాం పాలనలోనికి వచ్చాయి. నిజాం పాలనలో అరాచకం మరింత పెరిగింది. పాలెగాళ్ళ అక్రమాలకు అంతులేకపోయింది. కడపజిల్లాలోని వేముల పాళెగాడు తనను తాను రాజుగా ప్రకటించుకొన్నాడు. కొరవలు, యానాదులు, బేడర్లు, ఎరుకలు గ్రామాలపై బడి దోచుకొసాగారు. అట్టి పరిస్థితులలో 12-10-1800న దత్త మండలాల ప్రధాన కలెక్టరుగా మన్రో నియమింపబడినాడు. అతని క్రింద నలుగురు సబ్ కలెక్టర్లు వుండేవారు. ఆదవాని, హల్పనహళ్ళి, కడప, కంబంలలో వీరి కార్యాలయాలూ వుండేవి. మన్రోకు సహాయంగా మేజర్ జనరల్ డుగాల్డ్ క్యాంబెల్ నాయకత్వంలో ప్రధాన కేంద్రాలలో సైనిక దళాలుండేవి. అనంతపురం డివిజన్ మాత్రం మన్రో అధీనంలో వుండేది.

సిద్ధవటంలో వున్న కడప జిల్లా కార్యాలయం 1812లో కడపకు మార్చబడింది. 1828లో కంబం, దూపాడు, కోయిల కుంట్ల ప్రాంతాలను కడప జిల్లా నుండి విడదీసి కర్నూలు జిల్లాగా ఏర్పాటు చేశారు. 1911లో మదనపల్లి, వాయిల్పాడు ప్రాంతాలను కడప జిల్లా నుండి విడదీసి చిత్తూరు జిల్లాగా ఏర్పాటు చేశారు.