పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/73

ఈ పుట ఆమోదించబడ్డది

చేసి ఇచ్చారు. 1921లోనే కాంగ్రెస్ సంస్థ ఆ పతాకాన్ని కాంగ్రెస్ పతాకగా ఆమోదించింది.

22.7.1947న భారత రాజ్యాంగసభ ఈ పతాకాన్ని ఆమోదించింది. నెహ్రూ సలహామేరకు త్రివర్ణ పతాకంలో రాట్నానికి బదులుగా 'అశోక చక్రం' ఉంచబడింది.

క్రమంగా వెంకయ్యగారు రాజకీయాల నుండి దూరమయ్యారు. మద్రాసు వెళ్ళి ప్రెసిడెన్సీ కాలేజీలో భూగర్భ శాస్త్రంలో పరిశోధనలు చేసి ' డిప్లొమా' తీసుకొన్నారు. తర్వాత నెల్లూరు చేరి 1924 నుండి 1944 వరకు అక్కడే ఉంటూ మైకా (అభ్రకం) గురించి పరిశోధన చేశారు. వజ్రకరూరు (అనంతపురం జిల్లా) హంపీ మున్నగు చోట్ల ఖనిజాలను అన్వేషిస్తూ ప్రభుత్వానికి ఖనిజాల ఉనికిని గురించిన నివేదికలు పంపారు.

అంతవరకు బొగ్గు వజ్రంగా మారుతుందనుకొనేవారు. ప్రపంచంలో మొదటిసారిగ వజ్రపుతల్లి రాయిని కనుగొన్న పరిశోధకులు వెంకయ్యగారే. ఈ తల్లిరాయిని గురించి వెంకయ్యగారు ఆంగ్లంలో గ్రంథం వ్రాశారు. పాశ్చాత్య శాస్త్రజ్ఞఉలు వెంకయ్యగారి ప్రతిభా విశేషాలను ఎంతగానో కొనియాడారు. ప్రజలు వెంకయ్యగారిని 'వజ్రాల వెంకయ్య' అన్నారు.

వ్యక్తిగా వెంకయ్యగారు

దేశభక్తి భావనా సంపన్నులైన వెంకయ్యగారు, దక్షిణాఫ్రికా నుండి వచ్చిన తర్వాత ఉత్తరభారతదేశంలోని రహస్య విప్లవ సంఘాల్లో అయిదేళ్ళకుపైగా పని చేశారు. భారతదేశాన్ని పారిశ్రామికంగా జపాన్ తో దీటుగా పెంపొందించాలని ఆశించారు.

వెంకయ్యగారు ఆరడుగుల ఎత్తుండేవారు. నల్లని రంగులో ఉక్కు మనిషిలా ఉండేవారు. కంచులాంటి కంఠస్వరం, నిష్కళంక దేశభక్తుడు. అవినీతిని, అన్యాయాన్ని ఏ మాత్రం సహించేవారు కాదు.

పింగళి వారు మహారాష్ట్ర ప్రాంతం నుండి ఆంధ్రదేశానికి వలస వచ్చినవారు. పింగళి మోరు పంతు వంశీయులు. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి పింగళివారి ఇంటి ఆడపడుచు. నైజాం నవాబు వద్ద మహాసేనానిగా పనిచేసిన పింగళి మాదన్నగారి వంశీయుడే వెంకయ్యగారు.

ఆయన ఏనాడూ ఏ పదవినీ ఆశించలేదు. కాని ఆయన నిస్వార్థ సేవను ప్రభుత్వం గుర్తించకపోవడం విచారకరం. మన జాతికొక కేతనాన్ని నిర్మించిన వాడాయన. ఇతర దేశాలలో జాతీయ పతాక నిర్మాతలను ఆ ప్రభుత్వాలు ఎంతగానో గౌరవిస్తాయి. వారికి కావలసిన వసతులను ప్రభుత్వాలే ఉచితంగా సమకూరుస్తాయి. మన ప్రభుత్వం వెంకయ్యగారిని గుర్తించకపోవటం శోచకీయం. జాతీయపతాకాన్ని గురించి ప్రభుత్వం ప్రభుత్వం ప్రచురించిన పుస్తకంలో, మన పతాక నిర్మాత ఒక తెలుగువాడు అని వ్రాశారే కాని, వెంకయ్యగారి పేరును సూచించకపోవడం విచారకరం.

తెలుగువారు తమ వారిని గౌరవించటంలో ఏనాడూ ముందంజవేయలేదు. జీవితాంతం దేశం కొరకు స్వాతంత్ర్యం కొరకు పోరాడిన వెంకయ్యగారు చివరి