కోసం నాగయ్య, గుమ్మడి మరో మిత్రుడు వారి దగ్గరకు వెళ్ళారు. నాగయ్య గారు వచ్చారని విన్న రాధాకృష్ణన్ స్వయంగా వచ్చి నాగయ్యను ఆహ్వానించారు. నాగయ్యతో పాటు వచ్చిన మూడోవ్యక్తి, రాధాకృష్ణన్ గారికి పాదాభివందనం చేస్తే "మావంటి వారికి పాదాభివందనం ఎందుకయ్యా? మీ ప్రక్కనే వున్న నాగయ్యగారికి చేస్తే మీకు పుణ్యం వస్తుంది అన్నారట" రాధాకృష్ణన్. ఆమాటకు నాగయ్య పులకించి పోయాడు.
నాగయ్య చివరిదశలో మూత్రసంబంధమైన వ్యాధికి గురై అడయార్ లోని వి.హెచ్.ఎస్. సెంటర్ లో చేర్చబడ్డాడు. మృత్యుదేవతతో పోరాడుతున్న నాగయ్య వద్దకు అతని మిత్రులు ముదిగొండ లింగమూర్తి, ఇంటూరి వెంకటేశ్వరరావు అతని శయ్యవద్ద నిల్చి "రఘుపతి రాజారాం" గీతం పాడుతుండగా వింటూ అపర పోతన నాగయ్య 1973 డిసెంబర్ 30వ తేదీన కన్నుమూశాడు. తెలుగు సినిమా నటీనటుల విరాళాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి. డా. ఇంటూరి వెంకటేశ్వరరావు గారు, మిత్రులు అభిమానులు మున్నగు వారి సహకారంతో మద్రాసు త్యాగరాయ నగర్ లోని పానగల్ పార్కులో, ఈశాన్య భాగంలో 'నటయోగి నాగయ్య' కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టింపచేయగా రాష్ట్రపతి వి.వి.గిరి గారు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏటేటా ఆ విగ్రహం వద్ద డిసెంబరు 30వ తేదీన నాగయ్య వర్ధంత్యుత్సవాలు జరుపుకుంటూ ఆ మహానటునికి జోహార్లు అర్పిస్తున్నారు.