పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/56

ఈ పుట ఆమోదించబడ్డది

1951 లో ప్రతాపరెడ్డిగారు, పులిజాల హనుమంతరావుగారితో కలిసి 'ప్రజావాణి' దినపత్రికను స్థాపించి రెండేళ్ళు నడిపారు.

ఆంధ్రుల చరిత్ర మరియు సంస్కృతి పట్ల వారికి ప్రగాఢమైన అభిమానం ఉండేది. ప్రజలలో విజ్ఞాన వికాసానికి గొప్ప రచనలు చేశారు. గొప్ప పరిశోధకులుగా, కవిగా, నవలా రచయితగా, కథారచయితగా, సాహిత్య విమర్శకులుగా వారు సుప్రసిద్ధులు. తెలంగాణా ప్రజల భాషనుకాని, వారి సంస్కృతినిగాని తక్కువ చేసి మాట్లాడితే సహించేవారు కాదు.

"బ్రిటిష్ ఆంధ్రులు బ్రౌణ్యాంధ్రం (ఇంగ్లీష్ తెలుగు) మాట్లాడితే మేము తారక్యాంధ్రం (ఉర్దూ తెలుగు) మాట్లాడుతాము. వారిది ఇంగ్లీష్ దడదడ, మాది ఉర్దు గడబిడ" అనేవారు.

ముడుంబ వెంకట రాఘవాచార్యులు అను వ్యక్తి తెలంగాణాలో కవులు లేరన్నారట. ప్రతాపరెడ్డిగారు వారికి తగిన సమాధానం చెప్ప నిశ్చయించి నాలుగు నెలల్లో 354 కవుల జాబితా, వివరాలతో 'గోల్కొండ కవులు' అను గొప్ప సంచికను ప్రచురించారు. అదీ వారి పట్టుదల.

సురవరం వారు దాదాపు 40 గ్రంథాలు రచించారు. నిజాం రాష్ట్ర పాలనము, మొగలాయి కథలు, సంఘోద్ధరణము, ఉచ్చల విషాదము, గ్రంథాలయము, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, యువజన విజ్ఞానం మున్నగు గ్రంథాలను రచించారు. వారి రచనలలో ప్రధానంగా పేర్కొనదగినవి రామాయణ విశేషములు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర, దక్షిణ భారతదేశంలో సాంఘిక చరిత్ర వ్రాసిన వారిలో మొదటివారు సురవరం వారే.

' ఆంధ్రుల సాంఘిక చరిత్ర ' లో వెయ్యి సంవత్సరాల చిత్ర సంగ్రహం ఉంది. అందలి విశేషాలను, డా. ఎన్. గోపి, ఉదహరిస్తూ 'పరిశోధన' (సంచిక - 4) లో పేర్కొన్న ముఖ్యాంశాలివి.

1. నన్నయ తిక్కనల కాలంలో పురుషులు కూడా మట్టెలు ధరించేవారు.

2. తెలుగు వర్ణమాలను, ఓనమాలు అనటం శైవ సంప్రదాయం నుండి వచ్చిందని (ఓం నమః శివాయ) గుర్తించారు.

3. రెడ్లు, వెలమలు తెలుగువారు కాదనీ ఉత్తరాది నుండి వచ్చిన రాష్ట్ర కూటులు రెడ్లయినారని, తమిళదేశం నుండి వచ్చిన వెల్లాలు వెలమలైనారని, ప్రతాపరెడ్డిగారు పేర్కొన్నారు. వెలమలు సంఘ సంస్కరనాభిలాషులనీ, రెడ్లు పుర్వాచారపరాయణులనీ, ఈ రెండు తెగల మధ్య ఎప్పుడూ స్పర్థ ఉండేదని, శ్రీనాధుని కాలంలో ఇద్దరూ సమానులుగా పరిగణింపబడ్దారనీ వివరించారు.

4. విజయనగర కాలంలో మాన్యాలు మిరాశీలు ఏర్పడ్డాయి. గ్రామ వ్యవస్థలో 12 విధాల ఆయగాండ్లు ఏర్పడ్డారు. పోర్చుగీసు వారితో వ్యాపారం ప్రారంభమైంది. ఫ్రెంచి, ఇంగ్లీషువారు కూడా వ్యాపారార్థం రావటం ప్రారంభమైంది.