నెలకు వేయి రూపాయల ఫించన్ ఏర్పాటు చేశారు. నొస్సం జమీందార్ నిస్సంతుగా మరణించడంతో ఫించన్ మొత్తం ఆపివేయబడింది.
తెల్లదొరలు క్రమంగా కట్టుబడి మాన్యాల వంశ పారంపర్య హక్కును రద్దు చేసి మాన్యాలను స్వాధీనం చేసుకోవడంతో కట్టుబడి బంట్రోతుల్లో అసంతృప్తి చెలరేగింది.
1846 జూన్ నెలలో తనకు రావలసిన మేనెల ఫించన్ పైకం కోసం, చీటి వ్రాసి కోయిలకుంట్ల ట్రెజరీకి మనిషిని పంపాడు నరసింహారెడ్డి. అదివరకు, పైకం పంపుతున్న తాసిల్దార్ ఈసారి వచ్చిన మనిషిని తిట్టి, నరసింహారెడ్డి వస్తేకాని ఫించన్ పైకం యివ్వనన్నాడు. రెడ్డి ఉదాసీనంగా వుండటం గమనించిన తహసీల్దారు వారంట్ యిచ్చి బంట్రోతులను పంపాడు. వచ్చిన వాళ్ళను తన్ని తరిమేశాడు నరసింహారెడ్డి. ఈ విధంగా పోరాటం ఆరంభమైందంటారు.
మాన్యాలు పోగొట్టుకున్న కట్టుబడిదార్లు కొండజాతుల వాళ్ళు నరసింహారెడ్డిని ఆశ్రయించారు. నరసింహారెడ్డి నాయకత్వంలో దాదాపు 9 వేల మంది చేరారు. వనపర్తి, మునగాల, జటప్రోలు జమీందార్లు పెనుగొండ, ఔకు, జమీందార్లు, హైదరాబాద్‌కు చెందిన సలాం ఖాన్, కర్నూలుకు చెందిన పాపాఖాన్, బనగానపల్లె నవాబ్ మహమ్మద్ ఆలీఖాన్, కొందరు బోయలు, చెంచులు, బ్రాహ్మణులు కూడా నరసింహారెడ్డి సైన్యంలో చేరారు. కంపెనీ ప్రభుత్వం నరసింహారెడ్డిపై నిఘా పెట్టింది.
1846 జూలైలో (7, 8 తేదీలు కావచ్చు) నరసింహారెడ్డి 9 వేల మంది అనుచరులతో చాగలమర్రి తాలూకా రుద్రవరం గ్రామంపై దాడి చేశాడు. మిట్టపల్లి వద్ద పోలీసులు వారిని అటకాయించారు. ఈ పోరాటంలో ఒక దఫేదారు తొమ్మిదిమంది బంట్రోతులు మరణించారు.
నరసింహారెడ్డి బృందం మరుసటి దినం కోయిలకుంట్ల ట్రెజరి పైబడి ఆనాడు ఖజానాలో వున్న, ఎనిమిది వందల అయుదు రూపాయల పది అణాల నాలుగు పైసల మొత్తాన్ని దోచుకున్నారు. తహసీల్దారు రాఘవాచారిని నరసింహారెడ్డి మనుషులు బందీగా పట్టుకున్నారు. ఖజానా సిబ్బందిని అయిదుగురిని చంపివేశారు. నరసింహారెడ్డిని పట్టుకునేందుకు పోలీసులకు సహాయంగా సైన్యాన్ని పిలిపించమని కలెక్టర్ కడపలోని కమాండింగ్ ఆఫీసరును కోరాడు. కర్నూలు నుండి గుర్రపు దళాన్ని పిలిపించారు. నరసింహారెడ్డి, ప్రొద్దుటూరు సమీపంలోని దువ్వూరు ఖజానాను, చుట్టుపట్ల గ్రామాలను దోచుకున్నాడు. అప్పటికే సైన్యం జమ్మలమడుగు చేరుకున్నది. నరసింహారెడ్డి తన బృందంతో అహోబిలం కోట చేరుకున్నాడు. నరసింహారెడ్డి ఆచూకీ తీయడం ప్రభుత్వానికి కష్టమైంది. కంభం తహసీల్దారును వెంటపెట్టుకుని కడప నుండి కెప్టెన్ నాట్ పెద్ద సైన్యంతో బయలుదేరాడు. జె. ఎచ్. కొక్రీన్ మరో సైనిక దళంతో రుద్రవరం వద్ద, నాట్‌ను కలుసుకునే ఏర్పాటు చేశాడు. తిరుగుబాటు దళం గుత్తి కనుమ మీదుగా ముండ్లపాటు చేరుకుంది. అక్కడికి మూడుమైళ్ళ దూరంలోని కొత్తకోటలోని పాడుపడిన కోట, నరసింహారెడ్డికి కార్యాలయం అయింది. నరసింహారెడ్డి