పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/41

ఈ పుట ఆమోదించబడ్డది

తిలక్, మాలవ్యాల ప్రశంసలు పొందిన "కలియుగ భీమ"

కోడి రామమూర్తి నాయుడు

' తిండి కలిగితె కండ కలదోయ్, కండ గలవాడేను మనిషోయ్ '

అంటూ దేశ స్వాతంత్ర్య సంపాదన తర్వాత దానిని పదిలంగా పెంచేందుకు బలవంతులైన ప్రజలు కావాలని ఎలుగెత్తి చాటిన ప్రజాకవి గురజాడ అప్పారావు.

జాతీయోద్యమ వైతాళికులైన లోకమాన్య బాలగంగాధర తిలక్, భారతీయులను స్వాతంత్ర్య సమరంలో చేరమని ఉద్బోధించేవారు. 'స్వరాజ్యం నా జన్మహక్కు' అనే మంత్రోపదేశంతో యువతను ఉత్తేజపరిచేవారు. ఆ మహనీయుని ఆదేశాలను ఆచరణలో చూపాలని, అవిశ్రాంతంగా కృషి చేసిన ఆంధ్ర వీర కంఠీరవ కోడి రామమూర్తి నాయుడు.

'కలియుగ భీమ' బిరుదుగల కోడి రామమూర్తి నాయుడు విశాఖపట్నం జిల్లా వీరఘట్టంలో 1882, ఏప్రిల్ లో జన్మించారు. తండ్రి కోడి వెంకన్న భూకామందు, ఆంగ్లేయుల పట్ల భక్తిశ్రద్ధలు కలవాడు. తన కుమారుడు ప్రభుత్వోద్యోగంలో చేరి, మంచి పదవినందుకోవాలని ఆశించాడు. కాని ఆయన అనుకున్న దొకటి, జరిగింది మరొకటి.

బాల్యంలోనే తల్లిని కోల్పోయిన కోడి రామమూర్తి అయిదేళ్ళ ప్రాయంలోనే ఇరుగు పొరుగు వారితో చిలిపి జగడాలాడేవాడు. తండ్రి గారు, కుమారుని అల్లరి పనులు సహించలేకపోయారు. వెంకన్నగారు, తన తమ్ముడు కోడి నారాయణ స్వామి ( పోలిస్