విశ్వేశ్వరయ్యగారిని సూపరింటెండెంట్ ఇంజనీర్ గా నియమించింది. అప్పుడే కొల్హాపూర్, ధార్వాడ, బిజాపూర్ మొదలగు పట్టణాలలో మంచినీటి పథకాలను సిద్ధపరచారు. బొంబాయి రాష్ట్ర ప్రభుత్వోద్యోగాన్ని స్వయంగా వదులుకున్నారు. రెండు సంస్థానాల నుండి ఛీఫ్ ఇంజనీర్ పదవులు చేపట్టమని ఆహ్వానాలు వచ్చాయి. అన్నిటిని తిరస్కరించి ఇటలీ, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, మొదలగు దేశాలలోని బృహన్నిర్మాణాలను పరిశీలించి, ఆయాదేశ శాస్త్రవేత్తలతో సంప్రదింపులు జరిపి 1909లో స్వదేశం వచ్చారు.
ఇటలీ పర్యటనలో ఉన్నపుడే హైదరాబాద్ నగర రక్షణా పథకం నిర్మించుటకు స్పెషల్ చీఫ్ ఇంజనీర్ గా ఆహ్వానించాడు నిజాం. విశ్వేశ్వరయ్యగారి నేతృత్వంలో సాగినవే హుసేన్‌సాగర్, హైదరాబాదు నగర విస్తృత పథకాలు.
స్వరాష్ట్రమైన మైసూరు సంస్థానాన్ని ఆదర్శ సంస్థానంగా తీర్చి దిద్దిన వారు ఆయన. చీఫ్ ఇంజనీర్ గా, ఆ తర్వాత దివాన్ గా పనిచేసిన ఆరేళ్ళలో అరువదేళ్ళ అభివృద్ధిని సాధించారు. హెబ్బాళ్ వ్యవసాయ కళాశాల, మైసూరు విశ్వవిద్యాలయం, ఛేంబర్ ఆఫ్ కామర్స్, సోప్ ఫ్యాక్టరీ, కన్నడ సాహిత్య పరిషత్ మున్నగు వాటిని నెలకొల్పారు.
విశ్వేశ్వరయ్య గారి ప్రజ్ఞా ప్రతిఫలంగా నిర్మింపబడినదే కృష్ణరాజసాగర్, లక్షలాది ఎకరాల మెట్ట భూములు సస్యశ్యామలంగా మారాయి. బృందావన్ ఉద్యానవనం వారి ప్రకృతి ప్రేమకు నిదర్శనం. భారతదేశ సంస్థానాలలో మొదటి ఉక్కు కర్మాగారం నెలకొల్పినది మైసూరు.
మైసూరు మహారాజా గారితో అభిప్రాయభేదం రాగా రాజీనామా చేసి బొంబాయి వెళ్ళిపోయారు. విదేశీ ఇంజనీర్ల ఆధ్వర్యంలో ప్రారంభింపబడిన భద్రావతి కర్మాగార నిర్మాణ కార్యక్రమం దెబ్బతినింది మహారాజా గత్యంతరం లేక బొంబాయిలోని విశ్వేశ్వరయ్య గారిని ఆహ్వానిస్తూ 'ఈ కర్మాగార పథకం మీదే, అది ఇప్పుడు రోగ గ్రస్తమైంది. మీరు ప్రారంభించిన ప్రజాప్రతినిధి సభ సభ్యులు దీనిని తెల్ల ఏనుగ అంటూ ఎగతాళి చేస్తున్నారు. మీరు వచ్చి దీనిని పునరుద్ధరించాలి' అని వ్రాశారు.
కర్మాగార పర్యవేక్షణ, వ్యయం మున్నగు వాటిపై అన్ని అధికారాలు విశ్వేశ్వరయ్య గారు చేపట్టారు. కార్మికులకు కొద్దిగా కూలీ పెంచారు. అవినీతిపరులైన విదేశీ ఇంజనీర్లను తొలగించారు. రేయింబగళ్ళు కార్మికులను ప్రోత్సహిస్తూ నష్టాల ఊబిలో నుండి లేవనెత్తి రెండేళ్ళలో లాభాలు చూపించారు. పెద్ద కర్మాగారాల్లో సుశిక్షితులైన భారతీయులనే నియమించాలని అందుకు శిక్షణావకాశాలు పెంచాలన్నారు. భద్రావతి కర్మాగారం పర్యవేక్షకులుగా మహారాజా గారి నుండి లభించిన లక్షా యాభైవేల రూపాయలను తిప్పి పంపుతూ, ఆ పైకంతో పారిశ్రామిక శిక్షణ సంస్థను నెలకొల్పమని రాజాగారిని కోరారు విశ్వేశ్వరయ్య. ఆ సంస్థకు తన పేరు పెట్టుటకు సమ్మతింపలేదు. ఆ విధంగా వెలిసిందే జయ చామరాజేంద్ర ఆక్యుపేషనల్ ఇన్‌స్టిస్టూట్.
విశ్వేశ్వరయ్యగారు 1921లో భారత ఉత్పత్తిదారుల సమాఖ్యను నెలకొల్పి జీవి