అంతా తలరాత - అన్న అలస భావం పోగొట్టిన
'భారతరత్న' మోక్షగుండం విశ్వేశ్వరయ్య
"ప్రజల సంపాదనాశక్తిని, కార్యదక్షతను నైపుణ్యాన్ని వివిధములైన చేతిపనుల ద్వారా పెంపొందించాలి. చేతనైన వారందరూ కష్టించి పని చేసే వీలు కల్పించాలి. యాంత్రిక శక్తిని ఉపయోగించుకుని దేశ పారిశ్రామిక ప్రగతికి ముందంజ వేయాలి. భారతీయులలో ప్రబలంగా ఉన్న 'అంతా తలరాత' అన్న అలస భావం రూపుమాపి నిరంతర కృషి ద్వారా సంపదను సాధించే దీక్షను, కర్తవ్య పాలనను ప్రజలలో రేకెత్తించుట ప్రభుత్వం కర్తవ్యం."
1912 మైసూరు సంస్థాన దివానుగా అధికారాన్ని చేపడుతూ శ్రీ విశ్వేశ్వరయ్య చేసిన ప్రసంగం నుండి పై వాక్యాలు ఉటంకింపబడినాయి. విశ్వవిఖ్యాత ఇంజనీర్‌గా, పాలనాదక్షుడుగా, రాజనీతిజ్ఞుడుగా, నిష్కామ దేశభక్తుడిగా అఖండ కీర్తిని ఆర్జించిన మహనీయుడు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య.
విశ్వేశ్వరయ్య పూర్వీకులు నేటి ప్రకాశం జిల్లాలోని మోక్షగుండం గ్రామం నుండి సుమారు రెండు శతాబ్దాల క్రితం, కర్ణాటక రాష్ట్రం (అప్పట్లో మైసూరు) లోని, చిక్క బళ్ళాపుర సమీపంలోని ముద్దేనహళ్ళిలో స్థిరపడినారు. అక్కడే విశ్వేశ్వరయ్య 1861 సెప్టెంబర్ 15వ తేదీన జన్మించారు. తండ్రి శ్రీనివాస శాస్త్రి. తల్లి వెంకట లక్ష్మమ్మ. వారిదో సామాన్య కుటుంబం. బాల్యంలోనే తండ్రి మరణించాడు.