ఆంధ్రరాష్ట్రం వల్లనే ఆంధ్రులు బాగుపడగలరని ఆయన భావించారు. 1952 అక్టోబరు 19వ తేదీన మద్రాసులోని మైలాపూర్‌లో బులుసు సాంబమూర్తిగారి బసలో 4వ సారి నిరాహారదీక్షకు పూనుకున్నారు. ఆ దీక్ష అవిచ్ఛిన్నంగా సాగింది. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుండి పోయింది. ప్రజల్లో ఆందోళన పెరిగింది. తనకు స్పృహ తప్పిన పక్షంలో తన వ్రతానికి భంగం కలిగించే విధంగా ఎట్టి పని చేయరాదని ఆయన శాసించారు. ఆంధ్రనాయకులు దేశాధినేతలకు విన్నపాలు పంపారు. కేంధ్రప్రభుత్వం చూస్తూ వుండిపోయింది. చివరకు ఆ దధీచి 1952 డిసెంబర్ 15వ తేదీన ప్రాణత్యాగం చేశారు.
శ్రీరాములుగారి మరణవార్త మెరుపుతీగలా దేశమంతటా వ్యాపించింది. ఆంధ్రుల సహనం హద్దులు దాటి విశృంఖలంగా దౌర్జన్యానికి దారి తీసింది. కేంద్ర ప్రభుత్వం ప్రజా ప్రభంజనానికి ఎదురు నిలువలేక ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర స్థాపనకు అంగీకరించింది.
1953 అక్టోబర్ 1 వ తేదీన కర్నూలు రాజధానిగ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.
'ఆంధ్రరాష్ట్రము వచ్చె
మహాంధ్రరాష్ట్ర మేరుపడువేళ
పొలిమేర చేర పిలిచె'
అని దాశరథి
ప్రజలనుత్తేజపరిచారు. ఆంధ్రుల అంతిమ లక్ష్యమైన ఆంధ్రప్రదేశ్ 1956 నవంబర్ ఒకటవ తేదీన హైదరాబాద్ రాజధానిగా అవతరించింది.
మైలాపూర్ రాయపేట హైరోడ్‌లోని 126 నంబర్‌న పొట్టి శ్రీరాములుగారు కన్నుమూసిన ఇంటిని ఆ త్యాగమూర్తి స్మృతిచిహ్నంగా మన రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతూ వున్నది. ఆ స్మృతి మందిరాన్ని పవిత్ర సాంస్కృతిక క్షేత్రంగా పెంపొందించటం తెలుగు ప్రభుత్వం మొదటి కర్తవ్యం.