పుట:Sumitra Charitram Kandukuri Veeresalingam.pdf/14

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వచ్చునప్పుడు ఒక కాగితముమీద 'ప్రమతి' యని వ్రాసి దాని నాచిన్న దానివస్త్రమున కంటించిపోయెను. ఆకాగితముమీదనే ఆమెది గొప్పవంశమనియు దైవవశమున దుర్దశప్రాప్తించిన దనియు సూచించుపదములుకూడ గొన్ని వ్రాయబడియుండెను. గాని యవి స్పష్టముగా దెలియదగినవిగా నుండ లేదు.

మేకలను మేపుటకై యాయరణ్యమునకు వచ్చిన గొల్ల వాడొక్కడు ఆచిన్న దానియేడుపు విని దయార్ద్రహృదయుడై దాపునకు వచ్చి చూచి, పిల్ల దాని నెత్తుకొని యింటికిపోయి పెంచుటకై తనభార్య కిచ్చెను. ఆగొల్లదియు పిల్లదానిని తనకుమార్తెలకన్నను ప్రేమతో బెంచుచుండెను గాని, యాగోప కుటుంబమువారు తమయొక్క నిరుపేదతనమునుబట్టి సర్వాభరణములతో నాచిన్నది తమకు దొరికినసంగతిని దాచవలసిన వారైరి. కాబట్టి ఆగొల్లవాడు తనభార్య మెక్కడనుండి వచ్చెనో యెవ్వరికిని తెలియకుండుట కయి కుటుంబముతోఁ గూడ తానుండుప్రదేశమును వదలివేసి, ఆ దేశమునకు రాజధానియైన యనంతసేవమునకు సమీపముననున్న పల్లె చేరి, ప్రమతియొక్క నగలలో గొన్నిటిని విక్రయించి పశువులమందలను గొని యచ్చట విశేషధనవంతుడుగా నుండెను. వాడు ప్రమతిని తనకూఁతునుగానే భావించుకొని పెంచుచుండెనేకాని, ఆమె రాచకూఁతురన్నమాటను లేశమైన నెఱిఁగినవాడు కాడు. ఆమెయు సంవత్సరక్రమమునఁ బెరిఁగి, యంతకంతకు