ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు.

సుమతి శతకము.


శ్రీరాముని దయచేతను
నారూఢిగ సకలజనులు నౌరాయనఁగా
ధారాళమైన నీతులు
నోరూరగఁ జవులు పుట్ట నుడివెద సుమతీ.1

అక్కఱకు రానిచుట్టము,
మ్రొక్కిన వరమీనివేల్పు, మొహరమునఁ దా
నెక్కిన బాఱనిగుఱ్ఱము
గ్రక్కున విడవంగవలయు గదరాసుమతీ.2

అడిగిన జీతంబియ్యని
మిడిమేలపుదొరను గొల్చి మిడుకుటకంటెన్‌
వడిగల యెద్దులఁ గట్టుక
మడిదున్నుక బ్రతుక వచ్చు మహిలో సుమతీ.3

అడియాస కొలువుఁ గొలువకు
గుడి మణియము సేయ బోకు, కుజనులతో