ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

పూర్వకవుల లక్ష్యములు గూర్చి సత్కవి
జనము లవు నటంచు సంనుతింప
విశ్రమంబు లేను వివరింతు నాలుగు
పదులమీఁద నొకటి విదితముగను.

5

యతి భేదములు :

క.

స్వరయతులు వ్యంజనాక్షర
విరతు లుభయవళులు ప్రాస విశ్రాంతులు నాఁ
బరకింప నాల్గు తెఱఁగుల
విరమణములు వరలుచుండు విహగతురంగా!

6


గీ.

రసను స్వరమైత్రివళులు స్వరప్రధాన
వళులు లుప్త విసర్జక స్వరవళులును
ఋవళియును ఋత్వసంబంధి ఋత్వసామ్య
వృద్ధులన స్వరవళు లేడు విధములయ్యె.
                              (3-6, 7, 8, 8, 10)

7


సీ.

క్రమమునఁ బ్రాణి వర్గజ బిందు తద్భవ
             వ్యాజ విశేష సమాహ్వయములు
మహి ననుస్వార సంబంధానునాసికా
             క్షరము విభక్తి ముకార యతులు
మొగి నువర్ణ విరామములు ఋజుప్రత్యేక
             భిన్నైక తరము లభేద విరతు
లోలి నభేద వర్గోష్మ విశ్రాంతులు
             సరస సంయుక్త విశ్రామములును
గరిమ నంత్యోష్మ సంధి వికల్పసంధి
విరమములు నాఁగ వ్యంజనాక్షర విరతులు
నిఖిల సుకవి ప్రయోగము ల్నెమకి చూడ
నేకవింశతి భేదంబు లెఱుఁగవలయు. (3-43)

8


సీ.

సర్వేశ యుష్మదస్మ చ్ఛబ్దయతులును
             బరరూప విరతులు ప్రాదియతులు
వెండి నిత్యసమాస విశ్రాంతి దేశ్యని
             త్య సమాస నిత్యాభిధానములును