ఈ పుట ఆమోదించబడ్డది

51


చెఱుకు బిళ్ళలు మంచి - చిఱుదిండి నరకు
పసిమి మామిడి పండ్ల - రసముల విసికి
పసిపచ్చ గిన్నెల - పాలు నే నినిచి
పలు వన్నె గిండ్లతో - పన్నీరు నించి
బంగారు చెంబుల - పానక మునిచి
బుంగల దింపించి - గంగోదకములు
పలుకు చిల్కల నుంచి -పందరమ్ములను
ఈరీతి పనులెల్ల - నింతి తగ జేసి
చనుదెంచె పాంచాలి - సంభ్రమమ్మునను
భద్రేభగమనసు - భద్ర రమ్మనుచు
చేడె శృంగారమ్ము - చేయంగ దలచె
పన్నీట స్నానంబు - బాగుగా నార్చి
తఱిబోసి కట్టించె - ధవళ వస్త్రమ్ము
విసనకఱ్ఱల గాలి - వీచె నిరుదెసల
పొసగగా తడి యార్చె - పొలతి శిరస్సు
ధూప వాసనల లో - దులిపి యల్లార్చి
గొజ్జంగి రేకులు - కొప్పున దుఱిమె
నొడ్డాణమును బెట్టె - నూగాడు మొలను
బిళ్ళల మొలనూళ్ళు - బిగిసి మ్రోయగను
ఘంటల మొల నూళ్ళు - ఘల్లున మెరయ
కంఠ హారమ్ములు - కౌస్తుభ మణులు