ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.గీ. పురుషులందున్న సద్గుణ పుంజములనే
గొప్పగాఁగను భావించుకొనుచు సతులు
హృదయపూర్వకంబుగ వారియెడలఁ గరము
భయము భక్తియు వెలయింపవలయుఁజుండు. 30.

తే.గీ. దైవసంకల్పమునఁజేసి తరుణులారా;
యంగహీనులును దరిద్రులైన పతులు
విూకు లభియించినను, వారి విూఱి నడప
కెంతయును భక్తితోఁ జరియింపవలయు. 31.

తే.గీ. పరపురుషులెంత సౌందర్యవంతులైన,
ధైర్యశౌర్యాది గుణములఁ దనరి యున్న,
సుదతి వారలఁ గన్నెత్తి చూడఁ గూడ
దితర నరుపొందు తృణముగా నెంచవలయు. 32.

ఆ.వె. మంత్రతంత్రములను, మందుల, నాథులు
వశ్యు లగుదు రనుట వట్టిమాట;
తెలిసెనేని,మున్నుగల ప్రేమయును బోవు
గాన నిట్టిభ్రమలు మానవలయు. 33.

ఆ.వె. పురుషుఁడూర లేకపోయినఁ, బూఁబోఁడి
పూలు నగలు మేనఁబూనరాదు,
నిలువఁ గూడ దింతి తలవాకిటను జేరి,
నాతి పెద్దపెట్ట నవ్వరాదు. 34.