ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.గీ. విద్యవలనను జ్ఞానంబు వెలయుఁ గాన,
నవని 'నిదిమంచి' 'యిదిచెడ్డ' యనుచుఁ దెలియ
బాలురునుబోలెఁ దప్పక బాలికలును
విద్య నేర్వంగవలయును హృద్యముగను. 17.

తే.గీ. విద్యనేర్చినఁ దొలుతను వినయమబ్బు,
వినయమున సర్వగుణము ల్వెలయు మిగుల,
వానిచేతను బతిభక్తి పాదుకొనును,
కావనను సుందరులు విద్య గఱవవలయు. 18.

ఆ.వె. చదువు నేర్చి రేని, సావిత్రిమొదలైన
పుణ్యసతులచరితములను జదివి,
వారియట్ల తాము వర్తింపఁ జూతురు,
తెలివి విస్తరిల్లి తీఁగెబోండ్లు. 19.

తే.గీ. చక్కఁదనమునకును దోడు చదువుకూడఁ
గలిగియుండిన, నందమౌయలరునకును
దావి గలిగినవడువునఁ దనరు చుంద్రు
పువ్వుబోండ్లు, విద్యాగంధమునను గరము. 20.

తే.గీ. చదువలేమిని మూర్ఖత ముదిరియున్న
మదవతిని భార్యఁగాఁ గొని మనుటకన్న,
సూరు విడనాడి వనవాస మెునరుచుటయె
వసుధలో వాసి యని తోఁచు రసికునకును. 21.

ఆ.వె. ఇంతి చదివెనేని, యింటివెచ్చంబులు
బయల నుదుక వేయువస్త్రములును
బద్దు వ్రాయు చుండు భర్తకు వేఱుగ
శ్రమము గలుగ కుండ జలజగంధి! 22.